19 July, 2026 | 5:30 PM

ప్రధాన రహదారిపై విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లు.. ప్రాణాలకు ముప్పు రోడ్డుపక్కనే

19-07-2026 10:36 AM

ప్రాణాలకు ముప్పుగా రోడ్డు పక్కనే ఏర్పాటు..

 వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి

ముత్తారం, జూలై 19(విజయ క్రాంతి) ముత్తారం ప్రధాన రహదారిపై రోడ్డు పక్కనే ఎలాంటి రక్షణ కంచె లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లు(Electrical transformers) ప్రమాదానికి ఆహ్వానం పలుకుతోంది. ముత్తారం కాసర్లగడ్డ బాస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వద్దకు వేళ్లే ప్రధాన రాహదారి పై నిత్యం వందలాది వాహనాలు, పాదచారులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ కో కార్యాలయం కూడా పోలీస్ స్టేషన్ వెనుకాలే ఉండడంతో అధికారులకు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

రోడ్డు విస్తరణ జరిగినప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించకపోవడం లేదా, రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడం వల్ల చిన్నపాటి వాహన ప్రమాదం జరిగినా భారీ ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో విద్యుత్ లీకేజీ ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రదేశానికి తరలించాలని, అప్పటి వరకు బలమైన రక్షణ కంచెతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.