19-10-2025 12:54:11 AM
-లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇంజినీర్
-రాజేంద్రనగర్ గంధంగూడ కార్యాలయంలో ఘటన
మణికొండ, అక్టోబర్ 18(విజయక్రాంతి) : లంచాలకు అడ్డుకట్ట వేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ పరిధిలో ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. హిమాయత్ సాగర్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా పనిచేస్తున్న అమర్ సింగ్ నాయక్, ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.గంధంగూడలోని విద్యుత్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ పనికి సంబంధించి కాంట్రాక్టర్‌ను ఏఈ లంచం డిమాండ్ చేయడంతో, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, అమర్ సింగ్ నాయక్ డబ్బులు తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు.హైదరాబాద్ రేంజ్-2 డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఏఈ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ ఘటన స్థానిక విద్యుత్ శాఖలో తీవ్ర కలకలం రేపింది.