‘విద్యుత్’ అక్రమాలు సీబీఐకి
భూముల ధరలు పెంపునకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్
- తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తొందరగా చేర్చేలా చర్యలు తీసుకోవాలి
- విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం
- 66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు
- క్యూర్ పరిధిలోని ప్రభుత్వ కార్యాయాల పెండింగ్ బిల్లులను వన్‌టైమ్ సెటిల్‌మెంట్
- మదర్ డెయిరీని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు అప్పగించే ఎంవోయూకు ఆమోదం
- రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): రాష్ట్రం లో విద్యుత్ కొనుగోళ్లు.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భూముల ధరలు సవరించాలని కూడా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాల్లో భాగంగా భూములు కోల్పోతున్న వారికి ఇచ్చే పరిహారంపై శాస్త్రీయ పద్ధతిన ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకుపైగా జరిగిన ఈ క్యాబినెట్ సమావేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా విద్యుత్ కొనుగోళ్లు.. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవినీతి ఆరోపణలు, మదన్ బీ లోకూర్ కమిషన్ నివేదిక, భూముల ధరల సవరణ, హిల్ట్ పాలసీ, ధాన్యం కొనుగోలు, సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా క్యాబినెట్‌లో చర్చించి పలు అంశాలకు ఆమోదం తెలిపింది.
క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ కొనుగో ళ్లులకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెంది న అంశాలు, కేంద్రప్రభుత్వ రంగ సంస్థలు ఈ కేసులో ఉన్నాయని, అందుకే నిష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు సీబీఐ విచారణ అప్పగించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కేరళలో యూడీఎఫ్ కూటమి విజయం సాధించడంతో క్యాబినెట్ సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.
క్యాబినెట్ నిర్ణయాలు..
విద్యుత్తు కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై .. 2024 మార్చి 14వ తేదీన రిటైర్డ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ పెద్దలు జస్టిస్ నరసింహారెడ్డిపై ఆరోపణలు చేయడంతో.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 2024 జూలైలో ఆయన విచారణ నుంచి తప్పుకోవటంతో.. జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను విచారణ కమిషన్‌గా నియమించడం జరిగింది.
2024 అక్టోబర్‌లో కమిషన్ మొత్తం 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం 2025 జనవరి 4వ తేదీన జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నివేదికపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. నివేదికను పరిశీలించిన అడ్వకేట్ జనరల్ తన సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు. వాటన్నింటినీ కేబినేట్ చర్చించింది.
రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈనెల చివరి వారం .. 26వ తేదీలో సవరించిన విలువలు అమల్లోకి వస్తాయి. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తితో ఉన్నారు. ధర పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిస్తున్నారు. దీంతోపాటు వాస్తవంగా మార్కెట్‌లో ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరల మధ్య భారీగా వ్యత్యాసముంది. అందుకు శాస్త్రీయ పద్ధతిన ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరిస్తుంది.
హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో పంటలు, పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు సమాచారం అందింది. వెంటనే ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకుని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నల్లగొండ-, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు అప్పగించే ఎంవోయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నల్లగొండ-, రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్‌కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్డీడీబీ నిర్వహిస్తుంది.
తెలంగాణలో 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల ఈ సోలార్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ. 66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలుచేసేందుకు ఆమోదం తెలిపింది.
క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేసేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 5864 కోట్ల బకాయిలున్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే వన్ టైమ్ సెటిల్మెంట్‌పై ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ జలమండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరు అందించనున్నారు.
రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్‌లు, టీ శాట్‌ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది.






