calender_icon.png 15 February, 2026 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు నెలల జీతం బంద్.. ఆగిన ఊపిరి

15-02-2026 12:00:00 AM

మదర్ డెయిరీ(నార్మూల్)లో జీతాలు రాకపోవడంతో మానసిక వేదనతో ఉద్యోగి మృతి

హయత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయం ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు, ఉద్యోగుల ఆందోళన 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 14 : హయత్ నగర్ లోని మదర్ డెయిరీ(నార్మూల్)లో మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఉ ద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్లాంట్ ఆపరేటర్ సూపర్ వైజర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో శుక్రవారం పనిలో ఉం డగా, బ్రెయిన్ స్ట్రోక్‌తో తీవ్ర అనారోగ్యంతో కుప్పకూలాడు. తోటి ఉద్యోగుల సాయంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, మెరుగైన చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించగా శనివారం ఉదయం మృతి చెందాడు.

దీంతో తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో హయత్ నగర్ లోని మదర్ డైయిరీ ఎదుట పెట్టి, ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్ లోని నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూని యన్ లిమిటెడ్ (నార్ముల్- మదర్ డెయిరీ)లో పసుమాముల గ్రామానికి చెందిన తులసిగారి బాల నర్సింహ్మ(46) ప్లాంట్ ఆపరేటర్ విభాగంలో ప్రీ ప్యాక్ సెక్షన్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు. ఇతను సుమారుగా 25 ఏండ్లకు పైగా మదర్ డెయిరీలో పని చేస్తున్నాడు. కాగా, శుక్రవారం డైయిరీలో బాలనర్సింహ పని చేస్తుండగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రైవేటు దవాఖానకు తరలించగా, మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బాల నర్సింహా శనివారం మృతి చెందాడు. గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఒత్తిడితో బ్రెయిన్ స్ట్రోక్ కు గురై బాల నర్సింహా మృతి చెందాడని కుటుంబ సభ్యులతో పాటు ఉద్యోగులు తెలిపారు.

అయితే, గాంధీ ఆస్పత్రి నుంచి మృతదేహా న్ని మదర్ డెయిరీ వద్దకు తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, డైయిరీ ఉద్యోగులు ఆందోళనకు చేపట్టారు. బాలనర్సింహ మృతికి పాలకవర్గమే కారణమని ఆరోపించారు. సమాచారం తెలుసు కున్న హయత్ నగర్ పోలీసులు మదర్ డెయిరీకి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా డైయిరీ ఎండీ లింగారెడ్డి మాట్లాడుతూ... సీనియర్ ఉద్యోగి మృతి చెందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. నీను కూడా కొద్ది రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నానని, ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని తెలుసుకున్నట్లు తెలిపారు. పాలకవర్గం సైతం రైతులకు బిల్లులు, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కృషి చేస్తున్నారని, త్వరలోనే బకాయిలు చెల్లిస్తామన్నారు.

బాలనర్సింహ మృతి చెందిన విషయాన్ని చైర్మన్ తో చెప్పానని, సోమవారం నిర్వహించే పాలకవర్గం సమావేశం లో చర్చించి, మృతుడి కుటుంబానికి న్యా యం చేస్తామని చెప్పినట్లు వివరించారు. మృతుడి అంత్యక్రియలకు రూ, 50వేల ఆర్థి క సాయం అందజేశారు. చర్చల అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించి, మృతదేహాన్ని అక్కడి నుంచి తరలిం చారు. వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు మదర్ డెయిరీ పాలక వర్గాన్ని కోరారు. ఆందోళనలో మృతి కుటుంబ సభ్యులు, పసుమాములకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.