15-02-2026 12:00:00 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): ప్రతి నిత్యం సుమారు లక్షా ముప్పు వేల మందికి పైగా ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలతో కిటకిటలాడే హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి వేధిస్తున్న ట్రాఫిక్ నరకానికి శాశ్వత పరిష్కారం లభించనుంది.
ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి ఆదేశాల మేరకు.. జలమండలి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ ట్రాఫిక్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలు, టీజీఐఐసీ వంటి 5 శాఖలు ఒక్కతాటిపైకి వచ్చా యి. శనివారం ఆయా శాఖల ఉన్నతాధికారులు హైటెక్ సిటీ, దుర్గం చెరువు ప్రాంతా ల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి జాయింట్ యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు.
ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు..
మాదాపూర్ హైటెక్ సిటీ రూట్లో ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేశారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ, ఏసీపీలు, జోనల్ కమిషనర్ హేమంత్ కలిసి ట్రిడెంట్ హోటల్ నుంచి శిల్పారామం వరకు క్షేత్రస్థాయిలో రోడ్డును పరిశీలించారు. లెమన్ ట్రీ హోటల్ నుంచి ట్రిడెంట్ హోటల్ వరకు ఉన్న మార్గంలో వాహనాల రద్దీకి కారణమవుతున్న బాటిల్ నెక్స్‌ను గుర్తించారు.
రోడ్డు విస్తరణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న జలమండలి ఎయిర్ వాల్వ్‌లను, ఎలక్ట్రిక్ పోల్స్‌ను వెనక్కి జరపడంపై ఆయా శాఖల అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. వీటిని సమీపంలోని అనుకూల ప్రదేశాలకు తరలించడం ద్వారా రోడ్డును వెడల్పు చేయాలని నిర్ణయించారు. అలాగే అక్కడి నుంచి హైటెక్ సిటీ మీదుగా మెడికవర్ ఆసుపత్రి వరకు చేపట్టాల్సిన రోడ్డు విస్తరణ పనులను కూడా అధికారులు చర్చించారు.
చెరువులో మురుగు నీరు కలవకుండా..
మరోవైపు దుర్గం చెరువులో మురుగు నీరు కలవకుండా నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి నేతత్వంలో హెచ్‌ఎండీఏ, లేక్స్, రెవెన్యూ విభాగాల అధికారులు చెరువు పరిసరాలను జల్లెడ పట్టారు. మాదాపూర్, సైలెంట్ వాలీ, క్యాచ్మెంట్ ఏరియాల నుంచి వచ్చే మురుగు నీరు నేరుగా చెరువులో కలవకుండా, అక్కడ ఇప్పటికే నిర్మించిన 5 ఎంఎల్డీ, 7 ఎంఎల్డీ సామర్థ్యం గల రెండు మురుగునీటి శుద్ధి కేంద్రాలకు మళ్లిస్తున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి అధికంగా వచ్చే మురుగు నీటిని అడ్డుకునేందుకు మాదాపూర్ పెట్రోల్ బంక్ నుంచి మాదాపూర్ ఐడీ వరకు 1000 ఎంఎం డయా భారీ పైపులైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. వర్షాకాలంలో వరద నీరు మురుగుతో కలిసి చెరువులో పడకుండా వాటర్ డ్రైన్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
రీసైకిల్డ్ వాటర్ వాడకం తప్పనిసరి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి రహేజా మైండ్ స్పేస్ పరిధిలో జరిగే భారీ భవన నిర్మాణాలు, పార్కులు, ల్యాండ్ స్కేపింగ్ అవసరాలకు ఇకపై భూగర్భ జలాలు, మంచినీటిని గానీ వాడకూడదని స్పష్టం చేశారు. ఆయా అవసరాలకు తప్పనిసరిగా వంద శాతం శుద్ధి చేసిన రీసైకిల్డ్ నీటినే వినియోగించాలని ఆదేశించారు. ఇందు కోసం దుర్గం చెరువు ఎస్టీపీ నుంచి ఆయా నిర్మాణ ప్రాంతాలకు ప్రత్యేకంగా పైపులైను వేసుకోవాలని, ట్రీటెడ్ వాటర్ ను అక్కడికి తరలించి వాడుకునేలా చర్యలు తీసుకో వాలని సూచించారు.