రామగిరిఖిల్లాను పారిశ్రామిక కేంద్రంగా... పర్యాటకకేంద్రంగా మారుస్తా
స్థానిక యువతకు ఉపాధి కల్పించే అభివృద్ధి, పెట్టుబడులే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
రామగిరి,(విజయక్రాంతి): చారిత్రక ప్రాధాన్యం కలిగిన రామగిరి ఖిల్లా ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పరిధిలోని మేడిపల్లి-రామగిరి ఖిల్లా శివారులో భూసేకరణ పూర్తి అయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
సోమవారం రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రామగిరి ఖిల్లా ప్రాంతంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కును మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, సంబంధిత ఫ్యాక్టరీ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. రామగిరి ఖిల్లా ప్రాంతంలో సుమారు 250 ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఆధ్వర్యంలో భూసేకరణ చేయడం జరిగిందని, పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీరు, రహదారులు, ఇతర మౌలిక వసతులు అన్నింటినీ ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని నాణ్యమైన పెట్టుబడులు రావడం, స్థానిక యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రామగిరి ప్రాంతం చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉండటంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి కూడా అనుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. ఖిల్లా ప్రాంతాన్ని పర్యాటక రంగంతో అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు.
రాష్ట్రానికి నాణ్యమైన పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అన్ని ప్రక్రియలను వేగవంతం చేసి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతుల కల్పనలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. పారిశ్రామిక పార్కు ఏర్పాటుతో రామగిరి ప్రాంతం అభివృద్ధి దిశగా కీలక అడుగు పడుతుందని అన్నారు.






