24-02-2026 12:00:00 AM
అపరిశుభ్రతకు నిలయాలు
మహబూబాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): పురపాలక సంఘాల పరిధిలో ఖాళీ ప్లాట్లు చెత్త కుండీలుగా మారిపోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో వేలాది ఖాళీగా ఉన్న ప్లాట్లలో సమీప ప్రజలు చెత్తను వేస్తున్నారు. ఆ చెప్తాను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించకపోవడంతో రోజురోజుకు పెరిగిపోయి పరిసర ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి.
వర్షాకాలంలో ఇక మరికొన్ని ఖాళీ స్థలాల్లో వరదనీరు, మురుగునీరు నిలుస్తోంది. వ్యర్థ పదార్థాలను వదిలేయడం వల్ల పందులు సంచరిస్తూ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. ఖాళీ ప్లాట్ల యజమానులు తమ స్థలాన్ని చుట్టూ ప్రహరీ నిర్మించకుండా వదిలేయడం వల్ల చెత్త వేయడానికి అనుకూలంగా మారాయి. పలు పట్టణాల్లో ఖాళీ స్థలాల్లో కోళ్లు, ఇతర షాపుల యజమానులు వ్యర్ధాలను తీసుకువచ్చి వదిలేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఖాళీ ప్లాట్ల యజమానులు తమ స్థలానికి సంబంధించిన హద్దుల్లో ప్రహరీ గోడ నిర్మించకపోవడం వల్ల చెత్త కుండీలుగా మారిపోతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలో తక్కువలో తక్కువ 5వేలకు పైగా ఇలాంటి ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు సమాచారం. చాలాచోట్ల రోడ్డుకు, డ్రైనేజీకి దిగువన ఖాళీ స్థలాలు ఉండడంవల్ల అక్కడ వర్షాకాలంలో నీరు నిలువ ఉండి చెరువులుగా మారుతున్నాయి.
దీనితో వర్షాకాలం లో దోమలు విపరీతంగా పెరగడానికి కారణం అవుతున్నాయి. ఖాళీ ప్లాట్ల వల్ల ఆయా ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు అసౌకర్యంగా మారుతున్నాయి. ఖాళీ ప్లాట్లను శుభ్రపరచుకోవడం తోపాటు, చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి చెత్త వేయకుండా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆయా పట్టణాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
వార్డు కౌన్సిలర్ ఆణి ‘ముత్యం’.!
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో 36వ వార్డు కౌన్సిలర్ గా ఇటీవల ఎన్నికైన ముత్యం వెంకన్న ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుండి అభివృద్ధి కోసం వచ్చే నిధుల కోసం నిరీక్షించకుండా, వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన సొంత ఖర్చులతో పరిష్కారం చూపుతూ ఆణి‘ముత్యం’గా నిలుస్తున్నారు. 36వ వార్డ్ ప్రజల కోసం, కాలనీ పరిశుభ్రత కోసం పనిచేస్తానని ఎన్నికల ముందే మాట ఇచ్చిన వెంకన్నగౌడ్ అదే తరహాలో ముందుకు సాగుతున్నారు.
బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచే సొంత ఖర్చులతో జేసీబీ యంత్రం ఏర్పాటుచేసి, 36వ వ వార్డ్ లోని మురుగు కాలువలు పూర్తిగా శుభ్రం చేసి, సజావుగా మురుగు నీరు పారేవిధంగా చర్యలు చేపట్టారు. చిట్టడువుల్లా మారి, దోమలకు, పాములు, ఇతర విషపురుగులకు ఆవాస ప్రాంతంగా మారిన ఓపెన్ ప్లాట్లను శుభ్రం చేయిస్తూ ఆణి‘ముత్యం’గా నిలుస్తున్నారు.
దుర్గంధంతో వేగలేక పోతున్నాం
అంబేద్కర్ సెంటర్లో పలుచోట్ల ఉన్న ఖాళీ ప్లాట్ లలో చెత్త, చేపలు, కోళ్ల వ్యర్ధాలు తెచ్చి పోస్తున్నారు. దీనితో దుర్గంధంతో భరించలేకపోతున్నాం. మున్సిపాలిటీ అధికారులకు చెప్పినప్పటికీ వాళ్లు తొలగించి వెళ్లగానే మళ్లీ అక్కడ యధావిధిగా చెత్తను వేస్తున్నారు. ఖాళీ ప్లాట్లలో చిత్త వేయకుండా కఠిన చర్యలు చేపట్టాలి. పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చెత్త కుండీలు ఏర్పాటు చేసి, ప్రతిరోజు మున్సిపాలిటీ సిబ్బంది చేత శుభ్రం చేయించాలి.
- ధర్మాచారి, కేసముద్రం
పరిశుభ్రంగా ఉండేలా చూస్తాం
కేసముద్రం పట్టణంలో ఖాళీ ప్లాట్ల యజమానులు తమ స్థలాల్లో చెత్త వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. ప్లాట్ల యజమానులకు మున్సిపాలిటీ ద్వారా సమాచారం ఇస్తాం. ఖాళీ ప్లాట్లలో చెత్త వేయకుండా, ప్రజలకు అవగాహన కల్పిస్తాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత గా భావించే విధంగా మున్సిపాలిటీ ద్వారా ప్రచారం నిర్వహిస్తాం.
- శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్, కేసముద్రం