ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
ఏడుగురు మావోయిస్టులు మృతి
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 112 మంది మరణం
బీజాపూర్, మే 23: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌ల్లోని నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్‌కుమార్ వెల్లడించారు. గురువారం అడవుల్లో నక్సలైట్లు ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం 11 గంటల సమయంలో కూంబింగ్ నిర్వహించారు.
అదే సమయంలో నక్సలైట్ల నుంచి కాల్పులు జరగడంతో పోలీసు బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఏడాది ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ఏకంగా 112 మంది మావోయిస్టులు మృతి చెందారు.






