హేమ డ్రగ్స్ తీసుకుంది!
85 మందికి రక్త పరీక్షల్లో పాజిటివ్
వీరికి సీసీబీ సమన్లు!
బెంగళూరు, మే 23: బెంగళూరు నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమతో పాటు మరో 85 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. మే 20న రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలు పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఇందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్‌గా వచ్చినవారికి సమన్లు జారీ చేస్తామని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) తెలిపింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని సింగెన అగ్రహార ప్రాంతంలోని జీఎం ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు.
వీరిలో తెలుగు నటులు హేమ, ఆషి రాయ్ ఉన్నట్లు సమాచారం. ఈ పార్టీ తెల్లవారుజాము వరకు కొనసాగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న హెబ్బగోడి పోలీసులు పార్టీని భగ్నం చేసి అందులో పాల్గొన్న దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫామ్‌హౌస్ నుంచి ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, క్రిస్టల్స్, హైడ్రో గంజాయి, కొకైన్, మాదక ద్రవ్యాల కోటింగ్ ఉన్న రూ.500 నోట్లు, 5 మొబైల్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసును సీసీబీకి అప్పగించారు. ఈ ఫామ్‌హౌస్ కాన్‌కార్డ్ సంస్థ యజమాని గోపాల్‌రెడ్డికి చెందినదిగా భావిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ ఈవెంట్‌ను నిర్వహించినట్లు సమాచారం.






