సంకల్పానికి సలాం
ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకున్న దివ్యాంగుడు టింకేశ్
ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా గుర్తింపు
న్యూఢిల్లీ, మే 23: సంకల్పానికి ఎవరెస్ట్ సలాం కొట్టింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. మూడు అవయవాలు కోల్పోయి.. ఎవరెస్ట్ ఎక్కిన తొలి దివ్యాంగుడిగా నిలిచాడు. ఆయనే హరియాణాకు చెందిన టింకేశ్ కౌశిక్. 30 ఏళ్ల కౌశిక్ మూడు అవయవాలు కోల్పోయినప్పటికీ సముద్రమట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకున్నట్లు ప్రైవేట్ దివ్యాంగుల హక్కుల సంఘం వెల్లడించింది.
టింకేశ్ 9 ఏళ్ల వయసులో విద్యుత్తు షాక్ కు గురయ్యాడు. ఆ ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చేయి పోగొట్టుకున్నాడు. అప్ప టి నుంచి కృత్రిమ అవయవాలను వాడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం గోవాకు షిఫ్ట్ అయ్యి అక్కడే ఫిట్‌నెస్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఫీట్ సాధించడంపై కౌశిక్ స్పందించాడు. స్వతహాగా కోచ్ కావడం వల్ల ట్రెకింగ్ సులభమే అనుకున్నానని, కానీ శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని వివరించాడు.
బేస్ క్యాంపునకు వెళ్లాలనుకునే ముందు శిక్షణ తీసుకున్నానని, కృత్రిమ అవయవాలతో శిక్షణ తీసుకోవడం చాలా కష్టంగా అనిపించిందని, అదే సమయంలో సవాల్‌గా తీసుకొని కచ్చితంగా లక్ష్యాన్ని పూర్తిచేయాలని అనుకున్నానని వెల్లడించాడు. మధ్యలో అనారోగ్యానికి గురైనప్పటికీ మానసిక స్థుర్యైంతో సవాళ్లను అధిగమించానని చెప్పు కొచ్చాడు. 90 శాతం వైకల్యంతో ఉన్న తాను లక్ష్యం సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. కౌశిక్ తన విజయంతో తాము గర్వపడేలా చేశాడని వికలాంగుల హక్కుల సంఘం ఆఫ్ గోవా చీఫ్ అవెలినో డిసౌజా సంతోషం వ్యక్తం చేశారు.






