calender_icon.png 2 November, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారుల నిర్బందం నిందితుడి ఎన్ కౌంటర్

31-10-2025 01:41:34 AM

-ముంబైలో పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం

-19మందిని రక్షించిన పోలీసులు

ముంబై, అక్టోబర్ ౩౦ : ఆడిషన్స్ కోసం స్టూడియోకు వచ్చిన చిన్నారులను నిర్బంధించి బెదిరింపులకు పాల్పడిన నిందితుడు పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ముంబైలోని పవయీ ప్రాంతంలోని ఆర్‌ఏ యాక్టింగ్ స్టూడియోలో గురువారం కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్‌ఏ స్టూడియోలో పనిచేసే రోహిత్ ఆర్య నాలుగైదు రోజులుగా ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం 15ఏళ్ల వయసులోపు పిల్లలు 100మంది వరకు ఆడిషన్స్ కోసం స్టూడియోకు వచ్చారు.

వీరిలో 80మంది వరకు చిన్నారులను బయటికి పంపించిన రోహిత్ .. మరి కొందరిని అక్కడే బంధించాడు. భయాందోళనకు గురైన పిల్లలు స్టూడియో కిటికీల నుంచి సాయం కోసం అరిచారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. నిందితుడికి నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినా చిన్నారులను విడిచి పెట్టేందుకు అతడు నిరాకరించాడు. చిన్నారులకు హాని కలిగిస్తానని బెదిరించడంతో అప్రమత్తమైన రెస్క్యూ బృందం బాత్‌రూం ద్వారా లోనికి ప్రవేశించి 17మంది చిన్నారులతో సహా 19మందిని రక్షించింది.

రెస్క్యూ ఆపరేషన్ సమయంలో నిందితుడు కాల్పులు జరిపాడని దీంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి ఎయిర్‌గన్, కొన్ని రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఓ ఆడియో విడుదల చేసిన నిందితుడు.. తన పేరు రోహిత్ అని, ఆత్మహత్యకు బదులు చిన్నారులను నిర్బంధించాలనే ప్లాన్ రచించినట్లు వెల్లడించాడు. తనకు డబ్బులు వద్దని, కొంత మందితో మాట్లాడాలని, వారి నుంచి కొన్ని సమాధానాలు తెలుసుకోవాలన్నాడు.