31 July, 2026 | 1:27 AM

కూరగాయల సాగును ప్రోత్సహించండి

31-07-2026 12:40 AM
  1. సెంట్రలైజ్డ్ కిచెన్స్‌పై దృష్టి పెట్టండి
  2. ఆర్గానిక్‌పై రైతులకు అవగాహన కల్పించాలి
  3. నిపుణుల కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి
  4. ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై నివేదికను అందజేసిన కమిటీ

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్  కిచెన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం తెలిపారు. రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వ్యవసాయ శాఖ నుంచి ఎక్స్‌టెన్షన్ అధికారులను నియమించి, సంబంధిత విభాగాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డికి ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. నివేదికలో ఎల్ నినో ప్రభావం, కార్యాచరణ, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సబ్సిడీ విత్తనాల మంజూరు, రుణాలు, గతంలో పండిన పంట విస్తీర్ణం, సాగుపద్ధతులు, విద్యుత్ అంతరాయాలు, డెయిరీ యూనిట్ల స్థాపన, అత్యవసర చర్యల పర్యవేక్షణ తదితర చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.