21 June, 2026 | 1:30 AM

మీసేవ రశీదులకు చెల్లు చీటీ

21-06-2026 12:30 AM
  1. 600 సేవలకు సంబంధించి సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు
  2. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి కొత్త విధానం

మహబూబాబాద్, జూన్ ౨౦ (విజయక్రాంతి): మీసేవ కేంద్రాల్లో వివిధ ధ్రువీకరణ పత్రా లు, వివిధ సేవలకు ఇప్పటివరకు ఇస్తున్న రశీదులకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి చెల్లు చీటీ చెప్పింది. మీసేవ కేంద్రాల్లో వివిధ సర్టిఫికెట్లు, ఇతర సేవలకు వినియోగదారులు చెల్లించే డబ్బులు, వివరాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రింట్ రశీదు ఇస్తుండగా శుక్రవారం నుంచి ఆ విధానానికి స్వస్తి పలికారు. వినియోగదారుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లను పంపిస్తున్నారు.

ఆ మెసేజ్‌లో సర్టిఫికెట్లకు, సేవలకు సంబంధించిన రుసుము వివరాలు సమగ్రంగా కనిపించే విధంగా లింకుతో కూడిన మెసేజ్‌లు పంపిస్తున్నారు. పేపర్ వినియోగం తగ్గడంతో పాటు, తాము దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్లు, ఇతర సేవల వివరాలు, వాటి ట్రాకింగ్ తెలుసుకునే విధంగా నూతన సాఫ్ట్‌వేర్‌తో సెల్ ఫోన్‌లకు సందేశాలు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. 600 సేవలకు ఇకనుంచి ఎలాంటి రశీదు ఇవ్వకుండా కేవలం సంబంధిత దరఖాస్తుదారుల వ్యక్తిగత సెల్ ఫోన్‌లకు మెసేజ్ మాత్రమే పంపనున్నారు.