22 April, 2026 | 12:53 AM

ముగిసిన అమర్‌నాథ్ యాత్ర

21-08-2024 03:47 AM
  1. మంచు శివలింగాన్ని దర్శించుకున్న 5.1లక్షల మంది భక్తులు 
  2. 12 ఏళ్ల రికార్డు బద్దలు

న్యూ ఢిల్లీ, ఆగస్టు 20: హిమాలయాల్లోని పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్ యాత్రలో ఈ ఏడాది రికార్డులు బద్దలయ్యాయి. దాదాపు 52రోజుల పాటు కొనసాగిన ఈ యాత్ర సోమవారంతో ముగిసింది. గత 10 సంవత్సరాల రికార్డులను ఈ యేడాది తిరగరాస్తూ దాదాపు 5.1 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని సందర్శించారు. యాత్ర ప్రారంభమైన మొదటిరోజు నుంచే ఇక్కడికి భక్తులు పోటెత్తారు. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19తో ముగిసింది. ఈ యేడాది దాదాపు 5లక్షలకు పైగా భక్తులు యాత్రలో పాల్గొన్నారు. కాగా 2011లో మొత్తం 6.34 లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొనగా, 2012లో 6.22 లక్షల మంది శివలింగాన్ని దర్శించుకున్నారు. 

గతేడాది నాలుగుసార్లు వాయిదా..

ఈ యేడాదివర్షం కారణంగా పహల్గామ్, బాల్తాల్ మార్గంలో యాత్ర ఒక్కసారి మాత్రమే వాయిదా పడింది. అయితే గతేడాది జమ్మూ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నాలుగుసార్లు వాయిదా పడింది. అయితే ఈ యేడాది ఇక్కడ అలాంటి ప్రకృతి విపత్తులు ఏమీ రాకపోవడంతో యాత్రికులు పోటెత్తారు.  ఈ గుహ దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయ పర్వతాలలో 3,880 మీటర్ల ఎత్తులో ఉంది. యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి పర్వత మార్గాల ద్వారా దాదాపు 36 కి.మీ ట్రెకింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే మధ్య కశ్మీర్ నుంచి ఈ మార్గం తక్కువగా ఉంటుంది. యాత్రికులు ఇక్కడ నుంచి 14 కి.మీ ట్రెక్కింగ్‌తో గుహకు చేరుకుంటారు.