తీరని యూరియా కష్టాలు
-రైతులకు తప్పని పడిగాపులు
-కొత్తగూడెంలో ఫిట్స్‌తో స్పృహ తప్పిన రైతు
-మరిపెడలో తొక్కిసలాట
-పలుచోట్ల రైతుల ఆందోళనలు
మహబూబాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఆందోళనలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో దాదాపు 6 వేల మంది రైతులు కూపన్ల కోసం తరలివచ్చారు. దీంతో రైతులకు ప్రత్యేకంగా పది కౌంటర్లు ఏర్పాటు చేసి కూపన్లు జారీ చేశారు.
కూపన్ల కోసం రైతులు తోపులాడుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. రైతులు ఒకరిపై ఒకరు పడడంతో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. 1,600 మంది రైతులకు కూపన్లు జారీ చేసి సొసైటీ, ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న యూరియా బస్తాలను ఇప్పించారు. ఇదే జిల్లా కురవి మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం తరలి రావడంతో స్థానిక నాగేంద్ర స్వామి దేవాలయ ఆవరణలో ప్రత్యేకంగా టెంట్ వేసి రైతులకు యూరియా పంపిణీ కోసం కూపన్లు జారీ చేశారు.
కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో తెల్లవారుజామున యూరియా కోసం వచ్చి నిరీక్షిస్తున్న ఎదళ్ళపల్లికి చెందిన రైతు ఆవుల నారాయణ ఫిట్స్ వచ్చి కిందపడ్డాడు. ఎస్‌ఐ రాజకుమార్ పోలీసుల సహాయంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. బయ్యారం మండల కేంద్రంలో మహబూబాబాద్ కొత్తగూడెం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట వద్ద జాతీయ రహదారిపై రైతులు వంటావార్పు నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా గణపురం, మహాదేవపూర్ మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం సొసైటీ ఎరువుల విక్రయ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. జనగామ జిల్లాలో కూడా ఇదేవిధంగా పలుచోట్ల రైతులు యూరియా కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
సిద్దిపేట జిల్లాలో
హుస్నాబాద్/చేర్యాల/బెజ్జంకి/దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫర్టిలైజర్ షాపుల ముందు గంటల తరబడి నిలబడలేక చెప్పులను క్యూలో పెట్టారు. బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం నాలుగు గంటల నుంచి రైతులు బారులు తీరారు. పోలీస్ సిబ్బంది చేరుకొని టోకెన్లు, బస్తాలు పంపిణీ చేశారు.
చేర్యాల మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద పోలీసుల బందోబస్తు మధ్య యూరియా టోకెన్ల పంపిణి చేశారు. పాస్‌బుక్ జిరాక్స్ కాగితాలను వ్యవసాయ అధికారులు బయటపడవేయడంతో క్యూలో ఉన్న రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టిన వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో రైతులు యూరియా కోసం నిరీక్షించారు.
ఒక లారీ యూరియా వస్తుందని సమాచారం అందుకున్న రైతులు రాత్రంతా జాగారం చేసి వేచి చూసినప్పటికీ నిల్వలు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. అక్కన్నపేటలో యూరియా లోడ్ రాగా, పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో పోలీసులు పహారాలో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేయాల్సి వచ్చింది. హుస్నాబాద్ లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేస్తున్నారు.
అక్కన్నపేటలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు ఆధ్వర్యంలో వినాయక విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చి నిరసన తెలిపారు. యూరియా కొరతను అక్రమ వ్యాపారానికి ఆసరాగా తీసుకుంటున్న ఎరువుల డీలర్లు, నల్లబజారులో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రూ.268 ధర ఉన్న యూరియా బస్తా, బ్లాక్ మార్కెట్‌లో రూ.500 నుంచి రూ.700 వరకు అమ్ముతున్నారంటున్నారు. అవసరం లేని పురుగుమందులను “లింక్ సేల్స్” పేరుతో బలవంతంగా అంటగడుతున్నారని, ఇది తమపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని ఆవేదన చెందుతున్నారు.






