5 June, 2026 | 9:16 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

05-06-2026 08:08 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని , పర్యావరణాన్ని రక్షించకపోతే భవిష్యత్ తరాలకు  భద్రత లేదని , అందుకే భవిష్యత్ తరాలకు పచ్చని భూమిని అందించడానికి ప్రతి ఒక్కరి కృషి చేస్తేనే రేపటికి భద్రత ఉంటుందని  మానేరు పర్యావరణ సమితి అధ్యక్షులు తోట  లక్ష్మణరావు, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జ్యోతి నగర్ లోని గణేష్ మండపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన పంచభూతాల కలయికే మన పర్యావరణం అని, అయితే, ఆధునిక మానవుడి స్వార్థం, మితిమీరిన సాంకేతికత, పారిశ్రామికీకరణ వల్ల నేడు పర్యావరణం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందన్నారు. గ్లోబల్ వార్మింగ్ (భూతాపం), అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం వంటి సమస్యలు భూమి ఉనికికే ప్రమాదకరంగా మారాయన్నారు.పర్యావరణాన్ని రక్షించుకోవడానికి భవిష్యత్ తరాలను కాపాడుకోవాల్సిన పరిస్థితులు అవసరం ప్రస్తుతం ఏర్పడిందన్నారు. ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మొక్కలను నాటడం, 

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం, జల సంరక్షణ, పునరుత్పాదక ఇంధనం, వ్యర్ధాల నిర్వాణపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు తెలిపారు. బొగ్గు ,పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాల తో తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతుందని, అందుకే  ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని సూచించారు. ప్రకృతిని వినియోగించుకోవాలని,   సోలార్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. చెట్లను విరివిగా పెంచినప్పుడే ప్రాణవాయువు లభిస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మానేరు పర్యావరణ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.