30 March, 2026 | 2:34 AM

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీరుపై ఎథిక్స్ కమిటీ

30-03-2026 12:34 AM
  1. కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ చేతులతో సంజ్ఞలు
  2. తుపాకీతో కాల్చేస్తానంటూ బెదిరింపులు
  3. భగ్గుమన్న సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ సభ్యులు, 
  4. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌బాబు
  5. ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫార్సు

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అనుచిత ప్రవర్తన పెద్దదుమారం రేపింది. ఆదివా రం సభలో కడియం శ్రీహరి ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. ఈ అంశంపై నిగ్గు తేల్చేందుకు ముందే సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించినట్లు హౌస్ కమిటీ వేయాలని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో నే కౌశిక్‌రెడ్డి తన చేతులు పైకెత్తి అనుచితమైన సైగలు చేస్తూ, తుపాకీతో కాల్చేస్తానన్నట్లు సంజ్ఞలు చేశారు.

దీంతో మంత్రులు, అధికార పార్టీ సభ్యులు భగ్గుమన్నారు. కౌశిక్‌రెడ్డి తీరు పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. వెం టనే, సీఎం రేవంత్‌రెడ్డి కలుగజేసుకుని కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీ వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను అన్ని పార్టీల సభా పక్ష నాయకులకు చూపించి మరీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెంటనే ఎథిక్స్ కమిటీ వేస్తున్నట్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కౌశిక్‌రెడ్డి వ్యవహారాన్ని స్పీకర్ వెంటనే ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు.

బహిష్కరించాలి: కాంగ్రెస్ సభ్యులు

సభలో సీనియర్ దళిత సభ్యుడైన కడియం శ్రీహరి పట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అనుచిత ప్రవర్తన అభ్యంతరకరమని, ఆయనపై చర్యలు తీసుకొని సభ్యత్వం రద్దు చేయా లన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశా రు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తీసుకున్న చర్యలను గుర్తు చేస్తూ సభా మర్యాదలు అందరికీ సమానమేనని పేర్కొన్నారు.

మంత్రి వాకి టి శ్రీహరి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కడియం శ్రీహరిని అవమానించేలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లా డుతూ.. దళిత ఎమ్మెల్యేను  బెదిరించడం సరికాదని, చట్టసభలోనే ఎస్సీలకు రక్షణ లేకుంటే, ఇక బయట ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని సభ నుంచి శాశ్వతం గా బహిష్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరా వు మాట్లాడుతూ.. సభలో సభ్యులను మాట్లాడకుండా అడ్డుకుంటున్న బీఆర్‌ఎ స్ సభ్యుల ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి తండ్రి లాంటి వారని, కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇచ్చి ప్రవర్తించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఎమ్మె ల్యే యశస్వినీరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మందుల సామే లు మాట్లాడుతూ.. సభలో కౌశిక్‌రెడ్డి తీరుకు బీఆర్‌ఎస్ సభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు క్షమాప ణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కౌశిక్‌రెడ్డి అనుచిత వైఖరిని పరిశీలించి, స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు దళితులంటే గౌరవం లేదని, కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాలూ నాయక్ మాట్లాడుతూ.. కడి యం శ్రీహరి వైపు కౌశిక్‌రెడ్డి చేతులు చూపి స్తూ కాల్చి పారేస్తానని చెదిరించారని, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఏం నేర్పుతున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ సభ్యులు రఘువీర్‌రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, వంశీకృష్ణ, మురళీనాయక్, మట్టా రాగమయి, నాగ రాజు మాట్లాడుతూ.. కౌశిక్‌రెడ్డి అహంకార పూరితంగా ప్రవర్తించారని, సభ జరగకుండా అడుగడుగునా అడ్డంకులు సృ ష్టించడమే బీఆర్‌ఎస్ ఎజెండాగా మారిందని మండిపడ్డారు. కనీసం కౌశిక్‌రెడ్డిలో పశ్చాత్తాపం సైతం లేదని, ఆయన్ను ఆ పార్టీ నేతలే వెనకేసుకొస్తున్నారని నిప్పులు చెరిగారు.