calender_icon.png 7 February, 2026 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Review: ‘యుఫోరియా’.. చిన్నపెద్దలందరికీ కనువిప్పు!

06-02-2026 10:58:04 PM

భూమిక చావ్లా, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్, విఘ్నేశ్ గవిరెడ్డి, అడ్డాల పృథ్వీరాజ్ తదితరులు ముఖ్య తారాగణంగా రూపొందిన చిత్రం ‘యుఫోరియా’. గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమా గుణ, యుక్తా గుణ నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీత సారథ్యం వహించారు. కాగా, ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 6, 2026వ తేదీన) థియేటర్లలో విడుదలైంది. వరుస ప్లాపులతో కొంతకాలం విరామం తర్వాత గుణశేఖర్ రూపొందించిన సినిమా కావటంతో అందరిలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. మైనర్ నేరస్తులు (జువైనల్ క్రైమ్స్) అనే సున్నితమైన కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పు పొందిందా? సమీక్షిద్దాం..  

ఇదీ కథ: 

చైత్ర (సారా అర్జున్) ఐఏఎస్ కావాలనే బలమైన ఆకాంక్ష కలిగిన ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి. తన కలలను నిజం చేసుకునే దిశగా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో తన స్నేహితురాలి ఆహ్వానం మేరకు ఒక పబ్ పార్టీకి వెళ్తుంది. అక్కడ వికాస్ (విఘ్నేశ్ గవిరెడ్డి), అతని స్నేహితుల బృందంతో చైత్రకు పరిచయం ఏర్పడుతుంది. అందంతో ఆకర్షిస్తున్న చైత్రపై కన్నేసిన వికాస్ ముందస్తు వ్యూహంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడతాడు. ఉన్నత విద్యావంతురాలైన వింధ్య (భూమిక) తన కొడుకు తప్పును ఎలా స్వీకరించింది? పోలీస్ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మీనన్) ఈ కేసును ఛేదించడంలో ఎలాంటి పాత్ర పోషించారు? ఆఖరికి చైత్రకు న్యాయం జరిగిందా? అన్నదే మిగతా కథ. 

తారాగణం, సాంకేతిక వర్గం తీరుతెన్నులు.. 

చైత్ర పాత్రలో సారా అర్జున్ నటన అద్భుతం. ఒక యువతి పడే వేదనను, తిరిగి పోరాడే ధైర్యాన్ని తన కళ్లలోనే పలికించింది. వింధ్య పాత్రలో భూమిక అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. క్రమశిక్షణ గల ప్రిన్సిపాల్‌గా, కొడుకు తప్పు వల్ల నలిగిపోయే తల్లిగా ఆమె నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కమిషనర్‌గా గౌతమ్ మీనన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. నాజర్ ఎప్పటిలాగే తన అనుభవంతో మెప్పించారు. సైకో సాహిల్ పాత్రలో అడ్డాల పృథ్వీరాజ్ భయపెట్టాడు. దర్శకుడు గుణశేఖర్ భారీ సెట్టింగులు పక్కన పెట్టి, సమాజంలో జరుగుతున్న ఒక పచ్చి నిజాన్ని చాలా ధైర్యంగా తెరకెక్కించారు. జువైనల్ క్రైమ్స్ వెనుక ఉండే మనస్తత్వాలను ఆయన విశ్లేషించిన తీరు బాగుంది. కాలభైరవ సంగీతం బాగుంది. ప్రవీణ్ పోతన్ సినిమాటోగ్రఫీ సహజంగా ఉంది. 

విశ్లేషణ: 

బలమైన కథాంశం, నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్. సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుంటాయి. సెకండాఫ్‌లో కథనం కొన్ని చోట్ల నెమ్మదించటం సినిమాకు మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. మరికొన్ని సీన్లు రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా ‘యుఫోరియా’ కేవలం సినిమా అనే కాకుండా, ప్రస్తుత సమాజానికి ఒక హెచ్చరిక లాంటిదని చెప్పవచ్చు.