రాత్రయితే తరలింపు.. రాస్తే బెదిరింపు!
- హుస్నాబాద్‌లో జర్నలిస్టులపైనే కేసు నమోదు
- నంగునూరులో జర్నలిస్టుల ఫిర్యాదుకు స్పందన కరువు
- మామూళ్ల మత్తులో పోలీసులు, రెవెన్యూ అధికారులు
సిద్దిపేట, జూన్ 22 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో ఇసు క, మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రయితే చాలు లారీలకొద్దీ సరుకు తరలిస్తున్నారు. ఇదేమిటని అడిగినా, పత్రికల్లో రాసినా బెదిరింపులకు దిగుతున్నారు. భౌతికదాడులకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పోలీ సు అధికారుల అండదండలతో హల్‌చల్ చేస్తున్నారు. పత్రికల్లో కథనాల ను పరిహాసం గా తీసుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇస్తున్నామన్న ధైర్యంతో సామాన్యులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అడపాదడపా తనిఖీలతో హడావుడి చేసే పోలీసులు టార్గె ట్ కోసం నామ్‌కే వాస్తే కేసులు పెడుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు సిబ్బంది కొరత సాకుతో మట్టిమాఫియాకే వత్తాసు పలుకుతున్నారు.
కొండపాక కేంద్రంగా..
కొండపాక మండలంలోని కుకునూరుపల్లి పోలీసు స్టేషన్, తిమ్మారెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలో రాత్రింబవళ్లు సాగుతున్న మట్టి దందాపై వార్త ప్రచురించిన ఓ దినపత్రిక జర్నలిస్టుపై దళారీ గ్యాంగ్ నాలుగు నెలల క్రితం దాడి చేసింది. దీనిపై జర్నలిస్టులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఏసీపీ అదేశాలతో స్టేషన్‌బెయిల్ కేసు నమోదు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఇదే మండలంలో దుద్దెడ, దర్గా గ్రామాల మధ్య మట్టి తవ్వకాలపై కొందరు జర్నలిస్టులు ఫొటోలు తీశారు. వారిపై కూడా మాఫియా భౌతిక దాడికి పాల్పడ్డారు.
ఓ జర్నలిస్టుకు కుడి భుజం విరిగింది. ఈ విషయంపై సిద్దిపేట త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో మరింత రెచ్చిపోయిన మాఫియా శుక్రవారం దుద్దెడలోని జర్నలిస్టుల ఇంటికి వెళ్లి సెల్‌ఫోన్లు లాక్కొని మరీ ఫొటోలు, వీడియోలు తొలగించడం చూస్తుంటే పోలీసుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనపై జర్నలిస్టు యూనియన్ జిల్లా ప్రతినిధులు త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సీఐ అందుబాటులో లేరంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, అక్కడ కూడా ఎలాంటి స్పందన లేదు.
హుస్నాబాద్‌లోనూ అదేతంతూ..
ఇక్కడ రెవెన్యూ, పోలీసుల తీరే వేరు. ఈ ప్రాంతం లో మట్టి, ఇసుక అక్రమ తరలింపు నిరంతరంగా కొనసాగుతోంది. రెవెన్యూ, పోలీసులకు అధిక మొత్తంలో ముడుపులు అందుతాయని ఇక్కడి ప్రజలు బహిరంగంగానే మాట్లాడుతారు. వివిధ దిన పత్రికల్లో, సోషల్ మీడియాలో వార్త కథనాలు ప్రచురితమౌతుంటాయి. కాని ఇవేవీ పోలీసులకు పట్టవు. జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులకు అసలు మట్టి మాఫియా తప్పుగా అనిపించకపోవడం వారి నిబద్ధతకు నిదర్శనం.
నంగునూరులో..
అక్రమ ఇసుక దందాకు కేంద్రం నంగునూరు మండలం. అందుకే ఈ మండలంలోని రెవెన్యూ, పోలీసు పోస్టులకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇక్కడి అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుంటాయి. రెవెన్యూ ఆఫీసు, పోలీసు స్టేషన్ ముందు నుంచే ఇసుక నిరంతరాయంగా తరలిస్తుంటారు. సరిపడ సిబ్బంది లేరంటూ రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకుంటారు. ఇటీవల ఇసుక తరలింపు ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను ఇసుక మాఫియా అసభ్యపదజాలంతో దుర్భాషలాడారు.
ఈ విషయంపై జర్నలిస్టులు రాజగోపాల్‌పెట పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాఫియాతో రాజీపడాలని ఉచిత సలహా ఇచ్చారు. జిల్లాలో ఒక చోట జరిగింది అంటే అక్కడి అధికారి లోపాయికారీతనం అనొచ్చు కాని జిల్లా వ్యాప్తంగా పోలీసుల తీరు ఒకే విధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. జర్నలిస్టులపై దాడులు జరిగితేనే పోలీసులు పట్టించుకోవడం లేదని, జిల్లా పరిపాలన గాడితప్పిందని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు.






