14 April, 2026 | 4:13 AM

విపక్షాలన్నీ ఏకమైనా బీజేపీని ఓడించలేవు

14-04-2026 01:56 AM
  1. మహిళల అభివృద్ధే ప్రధాన ధ్యేయం
  2. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
  3. మహిళలకు కాంగ్రెస్ చేసిందేమీలేదు
  4. నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

నిర్మల్/ఖానాపూర్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు రక్షణ అని, అటువంటి పార్టీని ఓడించేందుకు లౌకిక పార్టీలన్నీ ఏకమైన వచ్చినా వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లాలో ఆయన పర్యటించారు.

ఇటీవలి ఎన్నికల్లో ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా అంకం మౌనిక ఎన్నిక కావడంతో ప్రమాణ స్వీకారోత్సవం, విజయోత్సవరాలికి ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్, ఎంపీ నాగేష్‌తో కలిసి రాంచందర్‌రావు హాజరయ్యారు. అనంతరం నిర్మల్‌లో పండిత్ దీన్ దయాల్ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. దేశంలో జన సంఘం నుంచి ఏర్పడ్డ బీజేపీ దేశ రక్షణ, భద్రత సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ప్రపంచంలో గొప్ప శక్తిగా ఎదిగిందని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మూడు పర్యాయాలు దేశాన్ని పాలించి భారత్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిందని గుర్తుచేశారు. పార్టీకి అధికారం కన్నా సిద్ధాంతాలే ముఖ్యమని, దేశ కోసం ఎందరో బీజేపీ నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. అటువంటి పార్టీని ఇక ఓడించలేమని భావించిన దేశంలో లౌకిక పార్టీలన్నీ ఏకమైనప్పటికీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

బీజేపీ ప్రభుత్వం త్వరలో మహిళలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు 33 శాతం మహిళా బిల్లును పార్లమెంట్‌లో పెట్టబోతుందని స్పష్టంచేశారు. జనాభా కనుగుణంగా పార్లమెంట్, అసెంబ్లీల పునర్విభజన చేస్తుంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఎంఐఎం పార్టీలు ఇతర పార్టీలతో కుమ్ముకై రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ పాలన రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిందని, అదే బాటలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నడుచుకుంటున్నారని విమర్శించారు.

ప్రభుత్వ భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ధ ప్రజాసంక్షేమంపై లేదని ఎద్దేవాచేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, లక్ష ఉద్యోగాలు, తులం బంగారం, రైతు రుణమాఫీ, పెట్టుబడి సాయం ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ పాలన ఒక చరిత్ర ఘట్టమని అన్నారు.