14 April, 2026 | 4:19 AM

బీసీ మహిళలకు సబ్‌కోటా కావాల్సిందే

14-04-2026 01:54 AM
  1. మహిళా ప్రాతినిధ్యం లేని బిల్లును అంగీకరించం
  2. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
  3. వ్యతిరేఖ వైఖరిని అనుసరిస్తే బొందపెడతాం
  4. కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు 
  5. జాతీయ స్థాయిలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
  6. మాజీ స్పీకర్ మధుసూదనాచారి
  7.   16న పార్లమెంట్ ముట్టడికి బీఆర్‌ఎస్ మద్దతు
  8. మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్
  9. మహిళా సబ్ కోటాపై గన్ పార్క్ వద్ద బీసీల ధర్నా

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించిన తరువాతే మహిళా బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని, వారికి ప్రాతినిధ్యం లేని బిల్లును అంగీకరించబోమని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, మధుసూదనాచారి, వి. శ్రీనివాస్‌గౌడ్‌లు అన్నారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణి మంజరి సాగర్ ఆధ్వర్యంలో సబ్ కోటా డిమాండ్‌తో సోమవారం ధర్నా నిర్వహించారు.

నిరసనకారులు నల్ల రిబ్బన్‌లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటా కల్పించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. బీసీ మహిళలకు సబ్‌కోటా లేకపోతే బిల్లు పేరుతో అగ్రకులాలకు చెందిన మహిళలు చట్టసభలకు వెళతారని, బీసీలు అణచివేతకు గురవుతారని జాజుల ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల వ్యతిరేఖ వైఖరిని అనుసరిస్తే బీజేపీని బొందపెట్టడం ఖాయమని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు హెచ్చరించారు.

మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌లు మాట్లాడుతూ..మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలన్నారు. మహిళలకు సబ్ కోటా విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ భాగస్వామ్యం ఉంటుందన్నారు. పార్లమెంట్ ముట్టడికి బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందన్నారు. బీసీ మహిళల సబ్‌కోటా సాధన కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మణిమంజరి సాగర్ అన్నారు.

బీసీల ఆగ్రహానికి ప్రధాని నరేంద్రమోదీ గురికావాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీనాయకురాలు ఇందిరా శోభ న్ హెచ్చరించారు. ఈ ఆందోళనలో బీసీ జేఏసీ వర్కిం గ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, తారకేశ్వరి, గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, సంధ్యారాణి, తాటికొండ విక్రమ్‌గౌడ్ సుజాత, శ్యామల, కనకాల శ్యామ్ కూర్మ, విజయలక్ష్మి, పిట్ల శ్రీధర్, శేఖర్ సగర, వీరస్వామి, రాజేశ్వరి, స్వర్ణ గౌడ్, గౌతమి, గొడుగు మ హేష్ యాదవ్, మాధవి, లతా గౌడ్ వెంకటమ్మ, శివ మ్మ, ప్రసన్న, మీనా, అంజమ్మ, నరసమ్మ, నరసింహ, కవుల జగన్నాథం, ఉదయ్ నేత, హరి తిలక్ సింగ్  పాల్గొన్నారు.