calender_icon.png 3 December, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాయిలెట్ కూడా రష్యా నుంచే!

03-12-2025 12:36:17 AM

  1. తినే తిండి.. అందుకు అవసరమయ్యే పదార్థాలూ అక్కడి నుంచే..

రుచిచూసి.. విషం కలపలేదని చెప్పేందుకూ పరివారం

పుతిన్ భద్రతాపరమైన అంశాలు ఆసక్తికరం

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4, 5వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై భారత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ రెండు రోజు లూ పుతిన్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. పుతిన్ పర్యటన మరోసారి చర్చలోకి వచ్చింది. ఎందుకంటే.. ఆయనకు అంచెలవారీగా రష్యన్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతా వలయంగా ఉం టుంది.

అలాగే ఢిల్లీ పోలీసులు, కేంద్ర నిఘా ఏజెన్సీలు, యాంటీ -టెర్రర్ స్క్వాడ్స్ వంటి ప్రత్యేక బృందాలు పహారా కాస్తాయి. పుతిన్ అల్ట్రా మోడల్, అత్యాధునిక సాంకేతికత ఉండే బుల్లెట్ ప్రూఫ్ కార్లలోనే ప్రయాణిస్తారు. ఆయన తీసుకునే ఆహారం తయారీకి తెచ్చిన పదార్థాలు సైతం రష్యా నుంచి తెచ్చినవే ఉంటాయి. భద్రతాపరమైన కారణాల వల్ల పుతిన్ ఎక్కడ బస చేస్తారనే విషయం కూడా గోప్యంగానే ఉంది.

ఆయన వచ్చిన క్షణం నుం చి తిరిగి వెళ్లే వరకు అన్ని ఏజెన్సీలు నిమిష నిమిషం కాపుకాస్తాయి. ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం వంటి అంశాలను సీనియర్ అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు. భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు ఇప్పటికే రష్యా నుంచి 50 మంది భద్రతా సిబ్బంది ఢిల్లీకి చేరుకున్నారు. వీరు పుతిన్ పర్యటించే రహదారులు, సమావేశ స్థలాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో ప్రతిక్షణం డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇక పుతిన్ ఆహారం విషయానికొస్తే, ఆయన తినే ఆహారం, తాగునీరు కూడా రష్యా నుంచే వస్తాయట. అంతేకాదు, ఆయన వెంట వంట చేసేవా రు, ఆహారాన్ని రుచి చూసి, అది తినదగినదని చెప్పే పరివారమూ వెంట ఉంటుందట. ‘ఆహారంలో విషం కలపలేదు’.. అని చెప్పేందుకే ఈ బృందం పనిచేస్తుందట. ఆహార పదార్థాల తయారీకి వినియోగించే సామగ్రి కూడా రష్యా నుంచే వస్తుందట. ఆఖరుకు పుతిన్ వినియోగించే టాయిలెట్ కూడా మొబైల్ టాయిలెట్ అయి ఉంటుందట. అది కూడా రష్యా నుంచే తెప్పిస్తారట.