calender_icon.png 3 December, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్‌పై చర్చకు అధికారపక్షం అంగీకారం

03-12-2025 12:38:14 AM

  1. ఫలించిన విపక్షాల పట్టుదల

అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్‌తో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా భేటీ

9న ‘సర్’పై చర్చకు గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చించేందుకు ఎట్టకేలకు అధికార పక్షం అంగీకరించింది. రెండు రోజులుగా విపక్షాలు చేస్తున్న డిమాండ్‌కు దిగి వచ్చి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ‘సర్’పై లోక్‌సభలో చర్చ జరగాల్సిందేనని, విధి నిర్వహణలో మరణించిన 28 మంది బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్వోల) అంశంపైనా మాట్లాడాల్సి ఉందని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

ఇదే డిమాండ్‌తో సోమవారం జరిగిన సభ మరుసటిరోజుకు వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే  డిమాండ్‌తో విపక్షం పట్టుబట్టి వాకౌట్ చేసింది. రెండో రోజు మంగళవారం కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే సభ సజావుగా సాగింది. మధ్యాహ్నం తిరిగి సమావేశమైన 9 నిమిషాల్లోనే సభ మళ్లీ వాయిదా పడింది.

నిరసనల మధ్యనే గత సమావేశాల్లో సభ ఆమోదించిన బిల్లుల జాబితాను లోక్‌సభ జనరల్ సెక్రటరీ చదివి వినిపించారు. సభ మళ్లీ వాయిదా వేసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్‌లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. సమావేశానంతరం కాంగ్రెస్ విప్ కే సురేష్ మాట్లాడుతూ.. ఈ నెల 9న లోక్‌సభలో ‘సర్’పై చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు.

భలో 10 గంటల చొప్పున రెండు డిబేట్లకు సమయం కేటాయించారని, అవసరమైతే సమయం మరింత పొడిగించే అవకాశం ఉంటుందని చెప్పారు. విపక్షం ‘సర్’పైనే కాకుండా, మరింత లోతుగా ఎన్నికల సంస్కరణల అంశాన్నీ చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మం త్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ‘సర్’పై మాట్లాడేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. కానీ, పతిపక్షం ఒక నిర్దిష్ట కాలపరిమితి కావాలని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 8 తేదీ సభలో చర్చ జరుగుతుందని తెలిపారు.