పచ్చిరొట్ట సాగుకు రాయితీ ఉన్నా భారమే..
- సేంద్రియ సాగుపై భారంగా మారిన విత్తన ధరలు..
- రసాయనాల వైపే రైతుల చూపు?
- జిల్లాకు 4,600 క్వింటాళ్ల విత్తనాలు..
నంగునూరు, మే 21: భూసారాన్ని పెంచి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడంలో పచ్చిరొట్టె సాగుది కీలక పాత్ర. రాబోయే తొలకరి వర్షాల నేపథ్యంలో రైతులు దుక్కులు దున్ని పచ్చిరొట్ట విత్తనాలు చల్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, మార్కెట్లో విత్తన ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య రైతుకు ఈ సేంద్రీయ విధానం మోయలేని భారంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీజీఎస్డీసీ) ప్రకటించిన వానాకాలం-2026 అధికారిక ధరల ప్రకారం.. ప్రస్తుతం జీలుగ పూర్తి ధర క్వింటాకు రూ.16,350 కాగా, జనుము ధర క్వింటాకు రూ.15,550 గా ఉంది. ప్రభుత్వం వీటిపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, రాయితీ పోగా రైతులు చెల్లించాల్సిన ధరలు ఇలా ఉన్నాయి:
జీలుగ: క్వింటాకు రూ.8,175 (30 కిలోల బ్యాగ్ ధర రూ.2,452.50)
జనుము: క్వింటాకు రూ.7,775 (40 కిలోల బ్యాగ్ ధర రూ.3,110)
ఈ భారీ ధరలను భరించడం కష్టంగా మారిందని, సబ్సిడీ పోనూ వేలాది రూపాయలు చేతి నుంచి పెట్టాల్సి రావడంతో చాలామంది రైతులు మళ్లీ రసాయన ఎరువుల వైపే మొగ్గు చూపే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి విత్తన ధరలను తగ్గించి, సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని కోరుతున్నారు.
భూసారానికి మేలు.. అధిక దిగుబడికి దారి..
వరి, నూనెగింజలు, అపరాలు (పప్పుధాన్యాలు), ఉద్యాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్టెను భూమిలో కలియదున్నడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పశువుల ఎరువు లభ్యత తగ్గిన ప్రస్తుత రోజుల్లో పచ్చిరొట్టే రైతుకు కొండంత అండ. పూత దశకు రాకముందే ఈ పంటను భూమిలో కలియదున్నడం వల్ల భూమికి అవసరమైన నత్రజని, సేంద్రీయ కర్బనం పుష్కలంగా లభిస్తాయి. ఇది రసాయన ఎరువుల ఖర్చును తగ్గించడమే కాకుండా, నాణ్యమైన అధిక దిగుబడిని అందిస్తుంది.ప్రస్తుతం బహిరంగ మార్కెట్ (ఓపెన్ మార్కెట్) లో క్వింటా విత్తనాల ధర రూ.15,000 నుండి రూ.20,000 వరకు పలుకుతోంది.
చిన్న రైతులకు కష్టమే..
భూమికి బలం పెరుగుతుందని ప్రతి ఏటా జీలుగ చల్లుతాం. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తున్నా,మేము చేతి నుంచి క్వింటాకు రూ. 8,175 దాకా పెట్టాల్సి వస్తోంది. మాలాంటి చిన్న రైతులం అంత భరించలేం. ప్రభుత్వం స్పందించి రేట్లను అదుపు చేసి, సబ్సిడీ పెంచాలి.
జువ్వటి రాజు, రైతు (సీతారాంపల్లి) గట్లమల్యాల
సేంద్రీయ సాగును సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది జిల్లాకు 4,600 క్వింటాళ్ల విత్తనాలు రాగా,అందులో 2,000 క్వింటాళ్లు జీలుగ ఉన్నాయి.జిల్లా వ్యాప్తంగా 53 పంపిణీ కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాం. రైతు ముంగిట్లో’ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందిస్తోంది కాబట్టి రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
స్వరూప రాణి, జిల్లా వ్యవసాయ అధికారి (డిఏఓ), సిద్దిపేట






