ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి
- అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతలా
భావించాలి : ఎస్పీ రోహిత్ రాజు
అశ్వరావుపేట, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): అశ్వారావుపేటలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బుధవారం అరైవ్ ఎలైవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు,స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్ పాలకమండలి సభ్యులు, అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం తప్పనిసరి అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు. కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడం అని తెలిపారు.
ముఖ్యంగా యువతలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరిస్తూ. అనంతరం రోడ్లపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి,వాటి ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్త్స్ర యాయాతి రాజు, అదనపు ఎస్‌ఐ అఖిల, ఎంపీడీవో అప్పారావు, మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు,అంగన్వాడి కార్యకర్తలు, వివోఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






