ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం అందించాలి
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
కల్వకుర్తి మార్చి 6 : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ విద్యాలయం, గిరిజన బాలుర వసతిగృహం, సివిల్ సప్లై గోదామును పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వాసుపత్రిలో వార్డులను పరిశీలించి రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పోషకాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి వెళ్లి వసతిగృహాల్లో అమలు చేస్తున్న మెనూను, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్ రెడ్డి, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.




