ఆయిల్‌పామ్ సాగుపై శిక్షణ
శ్రీరంగాపురం మార్చి 6:ఉమ్మడి మండలాలకు చెందిన ఆయిల్ పామ్ రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం మాధనపురంలోని కేవీకే (కృషి విజ్ఞాన్ కేంద్రం)లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయిల్ పామ్ సాగులో రైతులు అనుసరించాల్సిన శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్ర రెడ్డి రైతులకు ఆయిల్ పామ్ పంట సాగులో వివిధ దశల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. సరైన ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, పురుగు మరియు వ్యాధి నియంత్రణ పద్ధతులు, అలాగే అధిక దిగుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులపై సమగ్రంగా అవగాహన కల్పించారు. సరైన వ్యవసాయ విధానాలను పాటిస్తే ఆయిల్ పామ్ పంటలో మంచి దిగుబడులు సాధించడంతో పాటు రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని ఆయన తెలిపారు.
అలాగే పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాలకు చెందిన పలు గ్రామాల ఆయిల్ పామ్ రైతులు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణలో పాల్గొన్నారు. శాస్త్రీయ పద్ధతులను అనుసరించి ఆయిల్ పామ్ సాగును అభివృద్ధి పరచాలని అధికారులు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉద్యాన శాఖ అధికారి విజయ్ భాస్కర్, ఉద్యానవన అధికారి కృష్ణయ్య, ఉద్యాన విస్తరణ అధికారులు బాలప్రకాశ్, శిరీష తదితరులు పాల్గొన్నారు.




