17 June, 2026 | 4:27 PM

Breaking News

పోస్టాఫీస్ బీమా పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి

17-06-2026 03:14 PM

తక్కువ ప్రీమియంతో కుటుంబాలకు ఆర్థిక భరోసా

జిల్లా కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్(విజయక్రాంతి): తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించే పోస్టాఫీస్ అనుబంధ బీమా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు. బుధవారం బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా రూ.436 వార్షిక ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పాలసీ తీసుకున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందగా, పాలసీ నిబంధనల ప్రకారం నామినీ అయిన ఆమె సోదరి కే. పేంటుబాయికి రూ.2 లక్షల బీమా చెక్కును కలెక్టర్ హరిత అందజేశారు.

అదే గ్రామానికి చెందిన కనక కమల పోస్టాఫీస్ అనుసంధాన రాయల్ సుందరం ప్రమాద బీమా పథకం కింద రూ.565 ప్రీమియంతో రూ.10 లక్షల ప్రమాద బీమా పాలసీ తీసుకున్నారు. ఇటీవల పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా పాము కాటు కారణంగా మృతి చెందారు. నామినీ అయిన ఆమె కుమారుడు సుధాకర్‌కు రూ.10 లక్షల బీమా చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేవలం కొన్ని వందల రూపాయల ప్రీమియంతో కుటుంబాలకు లక్షల రూపాయల ఆర్థిక భరోసా లభించడం ఈ పథకాల ప్రత్యేకత. కుటుంబ పెద్ద ఆకస్మికంగా మరణించినప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఇలాంటి బీమా పథకాలు కుటుంబాలకు అండగా నిలుస్తాయి.

18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో చేరాలని సూచించారు.  18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ప్రమాద బీమా పథకాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.ప్రజలు పోస్టాఫీస్‌ల ద్వారా అందుబాటులో ఉన్న సామాజిక భద్రతా పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. తక్కువ ప్రీమియంతో రూ.10 లక్షలు, రూ.15 లక్షల వరకు బీమా రక్షణ పొందే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి పథకాలు ఆపద సమయంలో కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.