calender_icon.png 13 February, 2026 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

13-02-2026 12:53:43 AM

కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత తెలిపారు. గురువారం ఆసిఫాబాద్లోని సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.

ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డుల లెక్కిం పును రెండు రౌండ్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు కౌంటింగ్ హాళ్లలో ఒక్కో హాల్కు ఐదు టేబుళ్లు చొప్పున మొత్తం పది టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ పర్యవేక్షకుడు, ఇద్దరు సహాయకులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. కాగజ్నగర్ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రాన్ని అక్కడి డి.ఎ.వి పాఠశాలలో ఏర్పాటు చేసి, 30 వార్డుల లెక్కింపును రెండు రౌండ్లలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ నిర్వహించబడుతుందని, సిబ్బంది ఉదయం 6.30 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. పొరపాట్లు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు అలోక్ కుమార్, ఆసిఫా బాద్ మున్సిపల్ కమిషనర్ గజానన్, మాస్టర్ ట్రైనర్ ఊషన్న, రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ పర్యవేక్షకులు, కౌంటింగ్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

మూడు అంచెల భద్రత..

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. గురువారం ఆసిఫాబాద్లోని తెలంగాణ సాం ఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కాగజ్నగర్లోని డి.ఎ.వి పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను ఆమె పరిశీలించారు. మూడు అంచెల భద్రతా వ్యవస్థ అమలు చేయాలని అభ్యర్థులు, ప్రతినిధులు, సిబ్బంది తప్ప ఇతరులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.