సుందరీమణుల పర్యటనకు సర్వం సిద్ధం
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి జానకి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల పిల్లలమర్రి పర్యటనకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి(District Collector Viziendira Boyi) అన్నారు. ప్రపంచ సుందరిమణులు వస్తున్న సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ డి జానకి(District SP D Janaki)తో కలిసి జిల్లా కలెక్టర్ పిల్లలమర్రి ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మే 10 నుండి 31 వరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో మే 16న ప్రపంచ సుందరీమణులు మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రి పర్యటన క్షేత్రాన్ని సందర్శించడం జరుగుతుందని తెలిపారు.
22 దేశాల సుందరీమణులు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని చేరుకుంటున్న నేపథ్యంలో వారికి స్వాగతం పలకడం, పిల్లల మర్రిలో ఏర్పాటు చేసిన చారిత్రక కళాఖండాలు, శిల్పకళలను తిలకించడం, దాదాపు మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉన్న మర్రి చెట్టు విశిష్టతలను సుందరీమణులకు వివరించేందుకు ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రతాప్, అదనపు కలెక్టర్ రెవెన్యూ మోహన్ రావు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి.రాములు, డి.ఎఫ్. ఓ సత్య నారాయణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, అర్.డి. ఓ నవీన్, డిఈఓ ప్రవీణ్ కుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.






