09-09-2025 12:21:53 AM
-కొండాపురంలో సమ భావన సంఘాలపై ఓ వివోఏ పెత్తనం
-ప్రశ్నించిన వారిపై కేసులు పెడతానంటూ బెదిరింపులు
-ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న అధికారులు.
-అయోమయంలో పలు సంఘాల సభ్యురాళ్లు
చిలుకూరు, సెప్టెంబర్ 8 : మండలంలోని కొండాపురం గ్రామంలో స్వయం సహాయక సంఘాలపై ఓ విఓఏ హద్దులు దాటి పెత్తనం చేస్తుందనీ, ఆమె ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందంటూ పలువురు సంఘ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొండాపురం గ్రామ సంఘ బంధంలో 52 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘ బంధంలోనే పొదుపులు, అప్పులు, వడ్డీలు, ఎం.ఎస్ పొదుపులు, ఎం,ఎస్, అప్పులు, బ్యాంకు, లింకేజీలు, వడ్డీలు, శ్రీనిధి వడ్డీలు, ఇంతవరకు సంఘ బంధాల్లో లెక్కలు చూపించలేదు. అలాగే 2010 నుండి పాత కమిటీ సాగుతుంది. దీనికి అంతటికి కారణం ఆమె అని, అంతా నా ఇష్టం అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తుందని గ్రామంలోని పలు సంఘాల సభ్యురాళ్ళు ఆరోపిస్తున్నారు.
తొలగింపబడినా విధుల్లోనే ఆమె..
21, డిసెంబర్ 2024 న, అక్రమ ధాన్యం కొనుగోలు విషయంలో విఓఏ శ్రీరాం కవితను జిల్లా కలెక్టర్ రిమూవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను కూడా లెక్కచేయకుండా నాటి ఏపీఎం నరసయ్య సహకారంతో గ్రామంలోని సంఘాలతో సీక్రెట్ గా పనులు చేసుకుంటూ పోయిందని ఆరోపణలు ఉన్నాయి. కొత్త విఓఏ నియమించమని ఎన్నిసార్లు అడిగినా ఏపీఎం పట్టించుకోలేదని, తొలగించిన విఓఏతో పనులు చేయించూడని పలు సంఘాల సభ్యులు బాహాటంగానే చెబుతున్నారు.
పలుసార్లు ఫిర్యాదులు :
ఆమె వ్యవహార శైలి బాగాలేదంటూ జనవరి 20, 2025న, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేసినట్లు సంఘ సభ్యులే చెబుతున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో మరోమారు అదే నెల 27వ తేదీన గ్రీవెన్స్ లో తిరిగి అదే అధికారికి ఫిర్యాదు అందించినట్లు తెలిపారు. అయితే వారం రోజుల్లో అధికారులు వచ్చి మాట్లాడుతారని చెప్పగా, నెల రోజులైనా ఎవరూ రాలేదని ఆరోపిస్తున్నారు.
ఆరోపణలెన్నో...
సంఘాలకు లోన్లు ఇప్పిస్తే లక్షకు వెయ్యి రూపాయలు కమిషన్ తీసుకుందని పలు సంఘాలకు చెందిన సంఘ సభ్యురాలు బాహాటంగానే చెబుతుండడం గమనార్హం. ఆమెను తొలగించిన సమయంలో గ్రామంలో లోన్లు కట్టాలన్న, లోన్లు తీసుకోవాలన్న వివోఏ లేక ఇబ్బంది పడుతున్నామని ఎన్నిసార్లు ఏపీఎం కి మొరపెట్టుకున్న వినలేదనీ, పైగా విఓఏగా కవితను మీరు నియమించుకుంటే మీకు లోన్లు వస్తాయని ఆయనే చెప్పేవారని బహిరంగంగానే చెబుతున్నారు.
ధాన్యం గోల్ మాల్ తో చర్యలు :
గత ఏడాది వానకాలంలో డిసెంబర్ 21, 2024, రోజున ఇతర రాష్ట్రాల నుండి, నేరేడుచర్లకు చెందిన రైస్ మిల్లు వ్యాపారి తక్కువ ధరకే వడ్లను కొని తెచ్చి ఇక్కడ మద్దతు ధరకు సర్కారుకు విక్రయించారు. దీనికోసం స్థానికంగా ఉన్న కొందరు రైతులతో ఒప్పందాలు కుదుర్చుకొని వారి ఆధార్ కార్డు నెంబర్, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చారు. ముందే ఐకెపి సెంటర్ అధికారులతో మాట్లాడుకుని దాని ప్రకారం సధరు ఐకెపి సెంటర్కు పంపగా వాళ్లు అదే వివరాలను అప్లోడ్ చేశారు. నగదు జమ అయిన తదుపరి రైతుల నుండి మిల్లర్లు ఆ సొమ్ము తీసుకొని ముందు కుదుర్చుకున్న ఒప్పందం వారికి డబ్బులు ఇచ్చారు. అనుమానం వచ్చిన రైతులు రాత్రి రాత్రికే లారీ లోడు వచ్చి ఉండడంతో, లారీ నీ చూడగా అది ఏపీ కి,చెందిన లారీ గా గుర్తించారు. రైతులందరూ కలిసి నిలదీయగా అసలు వ్యవహారం బయటపడింది.
తిరిగి వీధుల్లోకి .: ధాన్యం కొనుగోలు విషయంలో తొలగింపు అయిన ఆమెను జూన్ 18, 2025న తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆమె విధులు నిర్వహిస్తుంది.
నగదు స్వాహా ఆరోపణలు...
తదుపరి గ్రామంలోని సమ భావన సంఘం ఇందిరా -2 గ్రూపులో 2022 సెప్టెంబర్ 14న వివోఏ కవిత నాలుగు లక్షల రూపాయల లోన్ తీసి 12 మంది గ్రూపు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.33 వేల 150 ఇచ్చింది. ప్రజల ప్రతి ఒక్కరు 3,100 చొప్పున 29 నెలలు కట్టినారు. గ్రూపు సభ్యులందరూ ఆమెను ఇంకా బాకీ తీరలేదా అని అడుగగా తీరలేదని తెలిపింది అన్నారు. గ్రూపు సభ్యులకు అనుమానం వచ్చి బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీయగా పది లక్షలు అప్పు తీసుకున్నారని చెప్పడంతో సభ్యులంతా నిర్గాంత పోయారు. డ్రా చేసిన పది లక్షలు గ్రూపు సభ్యులకు పంచకుండా కేవలం రూ.4 లక్షల మాత్రమే పంచిందని గ్రూప్ సభ్యులు స్వయానా చెబుతున్నారు.
అయితే ఈ నగదును డ్రా చేసేందుకు గ్రూప్ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేయించిందని ఆరోపణలు వస్తున్నాయి. మా అప్పు తీరింది అని సంతకం పెట్టమంటే అప్పు ఉంది అది తీరాకే పెడతారంటూ విఓఏ అటకాయిస్తుందనీ చెబుతున్నారు. ప్రాంసరీ నోట్లపై ఎందుకు తప్పుగా రాశావని అడగగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండనీ, పోలీస్ స్టేషన్ కు పోతారా, కలెక్టర్ దగ్గర పోతారా మీ ఇష్టం నాకేం కాదంటూ బెదిరిస్తుందని పలువురు సంఘ సభ్యులు అందరూ ముందే చెబుతుండడం గమనార్హం. ఇదే విషయంపై సంఘ సభ్యులు గ్రామంలో ధర్నాకు దిగిన సందర్భంగా. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఆమెపై తగు చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం న్యాయం చేయాలని పలు సంఘాల సభ్యులు కోరుతున్నారు.
విచారణ చేపట్టాం
10 లక్షలు నగదులో అవకతవకలు జరిగాయంటూ ఇందిరా ఒ గ్రూపు సభ్యులు ఫిర్యాదు చేశారు. దానిపై నేను, సీసీ, కలిసి బ్యాంకుకు వెళ్లి మేనేజర్ ని, ఫీల్ అసిస్టెంట్ ని కలిసి వివరాలు అడిగాను. వీరు గతంలో ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు లోను గ్రూపు సభ్యులు తీసుకున్నారు. అది అట్లా ఉండగానే సి ఎల్ కింద 3,80,000 రూపాయలు లోను గ్రూపు సభ్యులు తీసుకున్నారని, అవి మొత్తం కలిపి పది లక్షల రూపాయలు అని బ్యాంక్ మేనేజర్ వివరణ ఇచ్చారు. దాంతో సమస్య తొలగిపోయింది. కవితను విధుల్లోకి తీసుకున్న మాట వాస్తవమే.
- వీరబాబు, ఏపిఎం, చిలుకూరు