09-09-2025 12:34:08 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): వివిధ కారణాలతో పార్టీని వీడి బయటకు వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు ఇతర పార్టీల నుంచీ కాంగ్రెస్‌లో చేరికలకు టీపీసీసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 15న కామా రెడ్డిలో లక్ష మందితో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పదవుల పంపకాల్లో సామాజిక న్యాయం పాటించాలని, వారం రోజుల్లో జిల్లాల్లో డీసీసీ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించింది.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇలా హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో సోమవారం టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కమిటీ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
సమావేశంలో పార్టీలో అంతర్గత సమీకరణాల సమతుల్యం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఓట్ చోరీకి సంబంధించిన అంశాలపైనా కొంత చర్చజరిగింది. ఈ నెల 15న కామారెడ్డిలో లక్ష మందితో కాంగ్రెస్ సభ నిర్వహించాలని, అందుకు జనసమీకరణ చేయాని పీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు.
పార్టీలో చేరికల విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. పార్టీ కేడర్‌ను.. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారు ఒక వర్గంగా, ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారిని రెండో వర్గంగా, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన వారిని మూడోవర్గం చేయాలని నిర్ణయించారు. వర్గాల ఆధారంగా పదేళ్లుగా పార్టీలో ఉంటున్న వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.
జిల్లాల్లో విస్త్రృతస్థాయి సమావేశాలు..
ఇకపై జిల్లాల్లోనూ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షిన టరాజన్ సూచించారు. ప్రతి కమిటీలో సామాజిక న్యాయానికి కట్టుబడి పదవులు అప్పగిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం ఉంటుందని భరోసానిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో 70- 80 శాతం పదవు లు పాతవారికే ఇచ్చామని, మిగిలిన 20 శాతం కొత్తవారికి అవకాశం కల్పిస్తామని తేల్చిచెప్పారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని పార్టీ యోచిస్తుందని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. 15న జరిగే కామారెడ్డి సభ ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చా రు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రతిష్ఠాత్మకమని, ఆ స్థానాన్ని కైవ సం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. వచ్చే వారంలో డీసీసీ కమిటీల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. మూడు నెలల్లో పార్టీ గ్రామ అధ్యక్షులు ఎంపిక ఉంటుందన్నారు.
ఉద్యమంలా చేరికలుండాలి : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
‘బీఆర్‌ఎస్ చిలువలు పలువలైంది. ఇకముందు ఎన్ని ముక్కలువుతుందో తెలియని పరిస్థితి’ అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. వివిధ పార్టీల నుంచి గ్రామ, మండల స్థాయిలో ఉద్యమంలా కాంగ్రెస్‌లో చేరికలు ఉండాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల ముందు పని చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ లేదా ప్రభుత్వ పదవి ఏదో ఒకటి తప్పకుండా వస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తాము ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొంటామని తెలిపారు.
మహేశ్‌కుమార్‌గౌడ్‌కు శుభాకాంక్షలు..
మహేశ్‌కుమార్‌గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.