7 August, 2026 | 7:51 PM

ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి

07-08-2026 06:36 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన దొబ్బల దాస్ అలియాస్ దేవదాస్ గల్ఫ్ దేశమైన రియాద్‌లో మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్‌కు లేఖ రాసిన ఎమ్మెల్యే, ఉపాధి కోసం రియాద్‌కు వెళ్లిన దొబ్బల దాస్ 2026 జూన్ 17న గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలను ప్రస్తావించారు.

కుటుంబ పోషణ బాధ్యత మొత్తం ఆయనపైనే ఉండటంతో, ఆయన మరణంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్ 16న జారీ చేసిన జి.ఓ. ఎంఎస్. నెం.205 ప్రకారం జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం (ఎక్స్‌గ్రేషియా) అందించే నిబంధన ఉందని గుర్తు చేశారు.

ఈ నిబంధనల మేరకు దొబ్బల దాస్ కుటుంబానికి వెంటనే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ ఆర్థిక సహాయం బాధిత కుటుంబానికి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కొంత ఉపశమనం కలిగించడంతో పాటు, వారి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన లేఖలో పేర్కొన్నారు.