రాయికల్ జలపాతం సవ్వడి
22-07-2024 12:18 AM
కరీంనగర్, జూలై 21 (విజయక్రాంతి): రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం నుంచి నీటి ప్రవాహం మొదలయింది. మోహినికుంట నిండి, రెండు గుట్టల మధ్య నుంచి వస్తున్న వరద నీటితో జలపాతం పరవళ్లు తొక్కుతూ నేలకు దూకుతున్నది. పచ్చటి ప్రకృతి అందాల మధ్య సహజసిద్ధంగా జాలువారుతూ ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్న ఈ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తున్నది. జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి జలపాతానికి వెళ్లేందుకు రోడ్లు వేయాలని కోరుతున్నారు. రోడ్డు సరిగా లేకపోవడంతో పర్యాటకులు అవస్థలు పడుతున్నారని, రోడ్డు బాగు చేస్తే పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.




