సివిల్ సప్లు, ఎఫ్‌సీఐ కొర్రీలు!
నాణ్యత లేమి, స్థలం కొరత సాకులు
గోదాముల వద్ద బియ్యం అన్‌లోడింగ్‌కు నిరాకరణ
లారీలను వెనక్కి పంపుతున్న వైనం
అధికారుల తీరుతో కుదేలవుతున్న మిల్లర్లు
లోడ్‌కు రూ.లక్ష వరకు నష్టం వస్తుందని ఆవేదన
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), పౌరసరఫరాల శాఖ నిబంధనలు, కొర్రీలు రైస్ మిల్లర్లకు శాపంగా మారాయి. నాణ్యత లేమి, గోదాముల్లో స్థలం కొరత వంటి సాకులు చూపుతూ.. బియ్యం అన్‌లోడింగ్‌కు నిరాకరిస్తున్నాయి. బియ్యం లారీలను తిరిగి వెనక్కి పంపుతుండటంతో మిల్లర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒక్క లోడ్‌కు రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో మిల్లింగ్ చేసి గోదాములకు బియ్యం రవాణా చేస్తున్నా ఎఫ్‌సీఐ, సివిల్ సప్లు అధికారులు పెడుతున్న మెలికలు తమకు నష్టాలు తెచ్చి పెడుతున్నాయని వాపోతున్నారు.
కారణాలివీ..
కూలీలు, లారీల కొరత, నాణ్యత లేని ధాన్యం.. వీటన్నింటి ప్రభావంతో కలిగే నష్టాలను భరిస్తూనే సకాలంలో మిల్లింగ్ చేసి సివిల్ సప్లు, ఎఫ్‌సీఐ గోదాములకు బియ్యం రవాణా చేస్తున్నారు. అయితే గోదాములకు వెళ్లిన తరువాత అక్కడ వివిధ కారణాలతో బియ్యం లోడ్ లారీలను తిప్పి పంపుతున్నారు.
కొన్నిసార్లు 20 రోజుల వరకు అన్‌లోడింగ్ చేయకపోవడంతో అక్కడ నిరీక్షించాల్సిన దుస్థితి. నిబంధనల ప్రకారం 3 శాతం వరకు ముక్కిన, రంగుమారిన బియ్యం ఉండవచ్చు. కానీ 3 శాతం లోపు ఉన్న బియ్యాన్ని కూడా తిరస్కరిస్తున్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) అయితే 0.5 శాతం ముక్కిన, రంగుమారిన బియ్యం ఉన్నా వెనక్కి పంపుతోంది. దీంతో 290 క్వింటాళ్ల బియ్యం (580 బ్యాగులు)తో వెళ్లిన లారీ వెనక్కి వస్తే హమాలీ ఛార్జీలతో కలుపుకుని రూ.60 వేల వరకు నష్టం వస్తుందని మిల్లర్లు అంటున్నారు.
అలాగే గోదాముల్లో స్థలం లేదంటూ బియ్యం లారీలను వెనక్కి పంపుతున్నారు. ఇలా చేసినా లారీకి రూ.60 వేల వరకు (హమాలీ ఛార్జీలతో) నష్టం తప్పడం లేదు. మరి కొన్ని సార్లు గోదాముల వద్ద హమాలీలు ఉండటం లేదు. దీంతో రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ కారణంగా లారీ వెయిటింగ్ ఛార్జీల రూపంలో నష్టం తప్పడం లేదని మిల్లర్లు వాపోతున్నారు.
అదనపు భారం
ఒక లారీ బియ్యాన్ని వెనక్కి పంపిస్తే రూ. 60 వేల నష్టం అనేది కేవలం స్థానిక గోదాములకే ఈ పరిమితి. స్థానిక గోదాముల నుంచి 8 కి.మీ వరకు మిల్లర్లు ఉచితంగానే బియ్యం రవాణా చేయాల్సి ఉంటుంది. 8 కి.మీ తరువాత క్వింటాకు.. కిలో మీటరుకు 50 పైసల చొప్పున ఇస్తారు. వాస్తవానికి 50 నుంచి 60 శాతం బియ్యం జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోని గోదాములను కేటాయిస్తున్నారు. బియ్యం లారీలు అక్కడికి వెళ్లిన తరువాత వెనక్కి పంపితే.. నష్టం రూ.లక్ష వరకు ఉంటుందని, ఇది ఎవరు భరించాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు.
ఉదాహరణకు స్థానిక గోదాములకు కాకుండా ఇతర ప్రాంతాల్లోని గోదాములకు బియ్యం పంపితే.. అక్కడ ఏదో ఒక కారణంతో దిగుమతి చేసుకోకపోతే లారీకి రూ.70 వేల వరకు నష్టం వస్తుంది. అదే ఇతర జిల్లాల గోదాముల విషయం చూస్తే ఈ నష్టం (అదనంగా రవాణా ఛార్జీలు) రూ.లక్ష వరకు నష్టపోవాల్సి వస్తోంది. అక్కడ రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తే నష్టం అదనం. ఒక్కో రోజుకు రూ.1,500 వరకు వెయిటింగ్ ఛార్జీలు భరించాలి.
గోదాముల ట్యాగింగ్‌లో గందరగోళం
అధికారులు గోదాములను సరిగా ట్యాగింగ్ చేయడం లేదని మిల్లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్యాగింగ్ అంటే గోదాముల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని బట్టి ఏ మిల్లర్‌కు ఎంత స్థలం (క్వింటాళ్లలో) కేటాయించడం. అయితే ఎంత స్థలం ఖాళీగా ఉంది, ఎవరెవరికి ఎంతమేర కేటాయించాలనే దానిపై అధికారుల్లోనే గందరగోళం నెలకొంది. అటు గోదాముల అధికారులకు, ఇటు సివిల్‌సప్లు, ఎఫ్‌సీఐ అధికారులతో.. డిస్ట్రిక్ట్ మేనేజర్ల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది.
ఫలానా గోదాములో మీకు 5 వేల క్వింటాళ్లకు సరిపోయే స్థలాన్ని కేటాయించామని చెబుతుంటారు. తీరా ఆ గోదాముకు లారీల్లో బియ్యాన్ని రవాణా చేస్తే 3 వేల క్వింటాళ్లకు సరిపోయే స్థలం మాత్రమే ఉంటుంది. మిగిలిన 2 వేల క్వింటాళ్ల బియ్యం దిగుమతికి స్థలం లేకపోవడంతో లారీలు వెనక్కి రావాల్సి వస్తోంది.
ఇక్కడ లారీల రవాణా ఛార్జీలు, హమాలీ ఛార్జీలను రైస్ మిల్లరే భరించాల్సి వస్తోంది. లేదా స్థలం ఖాళీ అయ్యేంత వరకు వేచి చూడాల్సి వస్తోంది. దీంతో వెయిటింగ్ ఛార్జీల భారం రైస్ మిల్లర్లే మోయాల్సి వస్తోంది. మరికొన్ని సార్లు గోదాముల వద్ద హమాలీల కొరత ఉంటోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భారం కూడా భరించక తప్పని పరిస్థితి నెలకొంటోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని రైస్ మిల్లర్లు కోరుతున్నారు.






