26 July, 2026 | 4:58 PM

"అభిమాన బంధానికి విలువిచ్చిన రజిని సాయిచంద్

26-07-2026 03:51 PM

చిన్నారి ‘కృతిక’కు ఆశీస్సులతో నిండిన ఆప్యాయ క్షణం!"

రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఆదివారం ఆప్యాయత, అభిమానం, అనుబంధానికి అద్దం పట్టే అరుదైన ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, తెలంగాణ కళాకారుడు సాయిచంద్‌కు వీరాభిమాని అయిన బోడ శ్రీకాంత్ (బబ్లూ) – సంధ్య దంపతులకు కుమార్తె జన్మించిన సందర్భంగా నిర్వహించిన 21వ రోజు నామకరణ మహోత్సవానికి అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయిన మాజీ గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్ రజిని సాయిచంద్ మాట నిలబెట్టుకుంటూ ప్రత్యేకంగా సమయం కేటాయించి వారి ఇంటికి విచ్చేశారు.

అభిమాని ఆహ్వానాన్ని కేవలం ఆహ్వానంగా కాకుండా, కుటుంబ బంధంగా భావించిన రజిని సాయిచంద్ చిన్నారి కృతికను ఒడిలోకి తీసుకుని ప్రేమగా ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా ఎదిగి కుటుంబానికి, సమాజానికి గర్వకారణం కావాలని ఆకాంక్షించారు. ఆమె రాకతో బోడ శ్రీకాంత్ కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది. "కార్యక్రమానికి రాలేకపోయినా మా ఇంటికే వచ్చి మా పాపను ఆశీర్వదించడం జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకం" అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

గ్రామస్థులు కూడా రజిని సాయిచంద్ చూపిన ఆప్యాయతను అభినందిస్తూ, "పదవి ముగిసినా మనుషుల పట్ల ప్రేమ, అభిమానుల పట్ల ఆప్యాయత మాత్రం తగ్గలేదు" అంటూ ప్రశంసలు కురిపించారు. చిన్నారి కృతిక చిరునవ్వుతో మొదలైన ఆ క్షణం ఒక కుటుంబానికి జీవితాంతం నిలిచిపోయే తీపి జ్ఞాపకంగా మారింది. రాజకీయాలకు అతీతంగా అభిమానం, ఆప్యాయత, మానవీయ విలువలు ఎంత గొప్పవో మరోసారి అక్కన్నపేట వేదికగా చాటి చెప్పింది.