8 June, 2026 | 2:45 AM

రేవంత్‌రెడ్డి.. గురువుకు తొత్తు

08-06-2026 01:28 AM
  1. నీటి హక్కులపై తెలంగాణకు ద్రోహం   
  2. నల్లమలసాగర్, పాలమూరుకు ఎలా లింక్ పెడుతారు?
  3. నదుల అనుసంధానంతో  రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు
  4. ప్రజా పోరాటానికి బీఆర్‌ఎస్ సిద్ధం : హరీశ్‌రావు 

 హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి) : తెలంగాణకు ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించిన నీటి హక్కులపై రాజీపడటం ఎత్తుగడ కాదని, గురువుకు తొత్తుగా మారి రాష్ట్రానికి సీఎం రేవంత్‌రెడ్డి ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. గోదావరిని నల్లమల సాగర్ ప్రాజెక్టుకు, పాలమూరు ప్రాజెక్టుకు లింకు పెట్టడం అంటే తెలంగాణ జల హక్కులను కాలరాయడమే అని స్పష్టం చేశారు.

సమాధానం చెప్పలేనప్పుడు, బూతులు మాట్లాడటం రేవంత్‌కు అలవాటేనన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడే కృష్ణా నీళ్ల విషయంలో ద్రోహం చేశారని, ఇప్పుడు గోదావరి జలాల విషయంలో అదే చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి బనకచర్లపై  బీఆర్‌ఎస్ ఎంతో పోరాటం చేసిందన్నారు.

బనకచర్ల, నల్లమల సాగర్ ఫెయిల్ కావడంతో, ఇప్పుడు గోదావరి-కావేరి నదీ అనుసంధానం ప్రాజెక్టు పేరుతో ముందుకు వచ్చారని విమర్శించారు. గోదావరిలో మాకు కేటాయించిన 968 టిఎంసీల నీటికి సంబంధించి ప్రాజెక్టుల క్లియరెన్స్ పూర్తయిన తర్వాతనే నదుల అనుసంధానం గురించి మాట్లాడాలని గతంలోనే ట్రిబ్యునల్‌కు సూచించినట్టు చెప్పారు. నదుల అనసంధానంలో 50శాతం నీళ్లు తెలంగాణకు ఇవ్వాలని, ఇంటర్ లింకింగ్ తెలంగాణలోని ఇచ్చంపల్లి లేదా సమక్మ సాగర్ నుంచి నాగార్జున సాగర్ కు కలుపాలని పోరాటం చేశామని గుర్తు చేశారు.

ఇంటర్ లింకింగ్‌ను తెలంగాణ నుంచి తీసుకుపోకుండా పోలవరం నుంచి నల్లమలసాగర్, గ్రాండ్ ఆనకట్టకు కలుపాలని చూస్తున్నారని, అంటే నదుల అనుసంధానంలో తెలంగాణకు ఎలాంటి భాగం లేదు, లాభం లేదని హరీశ్ స్పష్టం చేశారు. సమ్మక్క సాగర్ లేదా ఇచ్చింపల్లి నుంచి నాగార్జునసాగర్ ఆ తర్వాత సోమశిల అక్కడి నుంచి కావేరీ అనుసంధానమనేది ఆనాడు ఉన్న ప్లాన్ అని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భూభాగమే అంటకుండా కావేరికి నీళ్లు తీసుకుపోయేలా ఏపీ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.

2018లో ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ఇచ్చంపల్లి నుంచి లింక్ చేయాలనే ప్రతిపాదనకు నాటి కర్ణాటక ఇరిగేషన్ మంత్రి డీకే శివకుమార్, ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేని కావేరి అనుసంధానానికి ఎలా సపోర్టు చేసేలా మాట్లాడుతున్నదని ప్రశ్నించారు. బనకచర్లకు మీరు అనుమతి ఇస్తే, తెలంగాణలోని పాలమూరుకు ఎన్‌ఓసీ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, దీని వల్ల పాలమూరు జిల్లాకు నష్టం, గోదావరికి నష్టం జరుగుతుందన్నారు.   

చంద్రబాబు కళ్లలో ఆనందం చూడాలన్నదే రేవంత్ లక్ష్యం

కేసీఆర్ పదేళ్ల పాటు 968 టీఎంసీల తెలంగాణ హక్కులు కాపాడారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ చేతగాని సర్కార్ వల్ల సమ్మక్క సాగర్, 20 టీఎంసీల వార్దా, 40 టీఎంసీల ఎల్లంపల్లి, 9 టీఎంసీల ఆదిలాబాద్ మైనర్  ఇరిగేషన్, లోయర్ పెన్ గంగా 5 టీఎంసీల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, ఒక్కసారి పోలవరం కావేరి లింకు అయిన తర్వాత ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించారు. ఈ తుగ్లక్ ప్రభుత్వం, అవగాహన లేని సర్కార్ వల్ల మనకు గోదావరిలో 211 టీఎంసీల నష్టం వాటిల్లుతుందన్నారు.

చంద్రబాబు కళ్లలో ఆనందం చూడాలన్నదే రేవంత్ లక్ష్యమని, తెలంగాణకు ఏమైనా పర్వాలేదు అనే దిశగా పని చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు ఆలోచించడం లేదన్నారు.  పోలవరం-కావేరీ లింకును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ధర్నాలు చేయాలి, అఖిలపక్షానికి మేం సిద్ధమని తెలిపారు. అసెంబ్లీ పెట్టి తీర్మానం చేయాలని, మీ మోసాన్ని చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే ప్రజా పోరాటానికి బీఆర్‌ఎస్ సిద్దం అవుతుందని రా్రష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.