14 July, 2026 | 10:49 PM

విమానాశ్రయం మెట్రోకారిడార్‌పై కసరత్తు

28-04-2024 12:24 AM

అలైన్‌మెంట్, స్టేషన్ల స్థలాల పరిశీలన  

ప్రణాళికలపై అధికారులకు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదేశం

ఫ్లుఓవర్లు, ప్రైవేటు స్థలాలుసైతం పరిశీలన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): విమానాశ్రయం మెట్రో కారిడార్‌పై మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల వరకు శనివారం కాలినడక పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా మెట్రో అలైన్‌మెంట్, మెట్రోస్టేషన్ల స్థలాలను పరిశీలించారు. పైవంతెనలు, ప్రైవేటు స్థలాలు పరిశీనలతోపాటు స్టేషన్లకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా స్టేషన్లకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఈ పర్యటనలో మెట్రో ఉన్నతాధికారులతోపాటు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సిస్ట్రా ఇంజినీరింగ్ నిపుణులు కూడా పాల్గొన్నారు. 

ఎండీ సూచనలివే..

నాగోలు మార్గంలో కొత్తగా నాగోల్ వద్ద నిర్మించనున్న మెట్రోస్టేషన్ ప్రస్తుతం ఉన్న నాగోల్ స్టేషన్‌కు దగ్గరలోనే ఎడమవైపున (ఎల్బీనగర్) ఉంటుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ రెండు స్టేషన్లను కలుపుతూ విశాలమైన స్కైవాక్ నిర్మాణాన్ని చేపట్టాలని ఎండీ ఆదేశించారు. 

నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది, బ్రిడ్జిని ఆనుకుని ఉన్న పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్తు కేబుళ్ల దృష్టా, మెట్రో ఎలైన్‌మెంట్ మరో పది మీటర్లు ఎడమవైపుకు జరపాలని ఆదేశించారు. మూసీన ది అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని, మూసీనదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్‌లతో నిర్మించాలన్నారు. 

మూసీనది దాటిన తర్వాత కొత్తపేట జంక్షన్ నుంచి వచ్చే రహదారికి కనెక్టవిటీని ఇస్తూ, ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులందరి అవసరాల కోసం అదనపు స్టేషన్‌ను ప్లాన్ చేయాలని సూచించారు. 

ప్రతిపాదిత నాగోల్ ఆర్టీవో స్టేషన్ అల్లాపురి జంక్షన్ (లక్కీరెస్టారెంట్)కి సమీపంలో నిర్మించాలని సూచించారు. ఇది ఓఆర్‌ఆర్ కనెక్టవిటీకి ఉపయోగపడనుంది. ఫ్లుఓవర్ కుడి వైపున ఉన్న కామినేని హాస్పిటల్ స్టేషన్ తర్వాత, ఎల్బీనగర్ జంక్షన్ స్టేషన్ అక్కడకు దగ్గరలో ఉన్న అండర్‌పాస్, రెండు ఫైఓవర్‌ల నిర్మాణాల వల్ల అనేక అంజనీరింగ్ సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. జంక్షన్‌కు కుడి వైపున ఉండబోయే కొత్తస్టేషన్ కారిడార్ (మియాపూర్ ప్రస్తుత ఎల్బీనగర్ స్టేషన్‌కు విశాలమైన స్కైవాక్‌తో అనుసంధానించాలని ఎండీ ఆదేశించారు.

బైరామల్‌గూడ/సాగర్ రోడ్ జంక్షన్‌లో ఇప్పటికే ఎతైన ఫ్లుఓవర్‌లు ఉండటం వల్ల ఎయిర్‌పోర్టు మెట్రో లైన్ ఎత్తు ఇంకా ఎక్కువగా పెంచాల్సిఉంది. ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ ఎత్తును బైరామల్‌గూడ/సాగర్‌రోడ్ జంక్షన్ మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి, మెట్రోఅలైన్‌మెంట్‌ను ఫ్లుఓవర్లకు కుడివైపుకు మార్చాల్సి ఉంటుంది. పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో స్టేషన్ నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు మెట్రో ఎండీ సూచించారు. 

మైత్రినగర్, కర్మాన్‌ఘాట్, చంపాపేట్ జంక్షన్, ఒవైసీ ఆస్పత్రి, డీఆర్‌డీవో, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదిత స్టేషన్లను అక్కడకు దగ్గరలోని కాలనీవాసులకు వీలుగా జంక్షన్లకు సమీపంలో నిర్మించాలని సూచించారు.