రియల్టర్ల సమస్యలపై స్పందించని రియల్ ఎస్టేట్ సంఘాలు

28-04-2024 12:22:13 AM

కొంత మంది బిల్డర్లు చేస్తున్న రియల్ మోసాలపై నిర్మాణ సంఘాల నాయకులు స్పందించడం లేదు.  తెలంగాణ రాక ముందు వరకూ ఉన్న నిర్మాణ సంఘాల్లోని కొందరు పెద్దలు డెవలపర్లు ఎదుర్కొనే వాస్తవిక సమస్యలపై దృష్టి పెట్టేవారు. ప్రభుత్వంతో చర్చించి అధికారులకు అర్థమయ్యేలా సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. దీంతో రియల్ వ్యాపారులకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కారం అయ్యేయి. తెలంగాణ రాష్ర్టం వచ్చన తొలినాళ్లలోను ఈ పరిస్థితి ఉండేది. అయితే, గత కొంతకాలంగా నిర్మాణ సంఘాలు ఈ రంగం ఎదుర్కొనే సమస్యల పరిష్కారంపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. ప్రతి నిర్మాణ సంఘంలో బిల్డర్లు రెండు రకాలుగా చీలిపోయారు. ప్రీలాంచ్‌లు చేసేవారు ఒకవైపు, చేయని వారు మరోవైపు ఉన్నారు. ఈ క్రమంలోనే రియల్ మోసాలను నియంత్రించడంలో నిర్మాణ సంఘాలూ పూర్తిగా విఫలమయ్యాయని చెప్పవచ్చు. 

బైబ్యాక్ స్కీములు..

ముఖ్యంగా 2018 నుంచి హైదరాబాద్ రియాల్టీలో భిన్నమైన వాతావర ణం నెలకొంది. ప్రజల సొమ్ముతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే డెవలపర్ల సంఖ్య క్రమంగా పెరిగింది. కొందరు స్థల యజమానులు, ఏజెంట్లు, ఇతర వృత్తులకు చెందినవారు.. రియల్ రంగంలోకి అడుగుపెట్టారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు నగరానికొచ్చి యూడీఎస్, ప్రీలాంచ్‌ల్ని మొదలెట్టారు. బై బ్యాక్ స్కీముల్ని ఆరంభించారు. కమర్షియల్, రిటైల్ స్థలాలను అద్దెలిస్తామంటూ ప్రకటనల్ని గుప్పించారు. ముక్కూమొహం తెలియని వారూ కోట్లాది రూపాయల్ని వసూలు చేశారు. వీరందరి ఉద్దేశం ఒక్కటే.. ఏదో రకంగా ప్రజల సొమ్ము దోచుకోవడమే. ఎలాంటి అపార్టుమెంట్లు కట్టనివారు కూడా ప్రీలాంచ్‌లో ఫ్లాట్లంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి అమాయకుల నుంచి అందినకాడికి దండుకుం టున్న సందర్భాలున్నారు. 

వాటాల కొట్లాటలతో..

కొంత మంది బిల్డర్లు, డవలపర్లు యూడీఎస్, ప్రీలాంచ్‌ల పేరిట ప్రకటనలిస్తున్నారు. తద్వారా వచ్చే సొమ్మును పంచేకునే దగ్గర పార్టనర్ల మద్య వాటాల పంచాయితీలు జరుగుతున్నాయి.ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకున్న డెవలపర్లు నగరంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి గత ప్రభుత్వం అండదండలు విపరీతంగా ఉండేవి. అసలీ యూడీఎస్, ప్రీలాంచ్‌ల మోసగాళ్లకు ప్రభుత్వంలోని ఎవరో ఒకరి అండ మాత్రం కచ్చితంగా ఉండేది. ఏకంగా సీఎంవో కార్యాలయంతో కూడా ప్రత్యేక పరిచయాలుండేవి. అందుకే, వారేం చేసినా, ఎంతమంది ప్రజలు ఫిర్యాదు చేసినా, పోలీసులు కేసుల్ని నమోదు చేయడానికి వెనకడుగు వేసేవారు. అయితే రేవంత్ ప్రభుత్వంలోను ఇదే పరిస్థితి ఉంటుందా? రియల్ మోసాలకు అడ్డుకట్ట పడుతుందా అనే చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో జరుగుతుంది.