రియల్ భవిష్యత్తుకు భరోసా

28-04-2024 12:26:43 AM

భవిష్యత్తుపై భరోసా ఉన్న నగరాల్లోకి మాత్రమే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. అలాగే భవిష్యత్తులో విలువ పెరుగుతుందనుకునే నగరాల్లోనే ప్రజలుస్థిరాస్తిరంగంలో పెట్టుబడులు పెడతారు. ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరం దేశంలోని ఇతర నగరాలకు దీటుగా ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతూ.. హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకూ నగరంలోకి అడుగుపెట్టే సంస్థల పెట్టుబడుల ప్రకటనలన్నీ వాస్తవరూపం దాల్చితే.. భవిష్యత్తులో హైదరాబాద్ స్థిరాస్తిరంగంలో రారాజుగా నిలవడం ఖాయం.

ఒకటి రెండు దశాబ్దాల క్రితం శివార్లలో తక్కువ ధరలకు ప్లాట్లు కొన్నవారు.. వాటిని విక్రయించి లగ్జరీ కమ్యూనిటీ కాలనీల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలోనే కొందరు పెట్టుబడులు పెడుతున్నారు. మరికొందరేమో తమ స్వస్థలాలకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో ప్రాపర్టీలను కొంటున్నారు. ఉదాహరణకు జనగామ, వరంగల్, భువనగిరి, యాదాద్రి వంటి ప్రాంతాలకు చెందినవారు ఉప్పల్, పీర్జాదిగూడ మీదుగా ఘట్‌కేసర్ వరకుస్థిరాస్తిరంగంలో పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఔటర్ రింగు రోడ్డుకు దగ్గరగా ఉండటంతో పాటు నగర శివారు ప్రాంతాలు కూడా నగరంతో పోటీ పడుతూ అభివృద్ది చెందుతుండటంతో ఆ ప్రాంతంలో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అలాగే కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు చెందిన వ్యక్తులు మేడ్చల్, కొంపల్లి, కండ్లకోయ వంటి ప్రాంతాల్లో ప్లాట్లను, భూములను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరీంనగర్, మంచిర్యాల్, సిద్ధిపేట్ వంటి ప్రాంతాలకు చెందిన వారు శామీర్ పేట్, తూముకుంట, అల్వాల్ వంటి ప్రాంతాల వైపు దృష్టి సారిస్తున్నారు. మరోవైపు రెగ్యులర్ మార్కెట్‌తో సంబంధం లేకుండా.. అత్యాధునిక గేటెడ్ కమ్యూనిటీలు, ఆకాశహర్మ్యాల్లో కొంతమంది బయ్యర్లు కోట్లు వెచ్చించి ఇళ్లను విక్రయిస్తున్నారు. ప్రవాసులు హై ఎండ్ విల్లాలు, ఆకాశహర్మ్యాల్లో ఫ్లాట్లను ఎంచుకుంటున్నారని బడా రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

నలుదిక్కులా సమానమైన అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. ప్రభుత్వాలు కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ అభివృద్ధి చేస్తే తక్కువ అభివృద్ది చెందిన ప్రాంతాల్లో రియల్  ఎస్టేట్ వృద్ధి మందగిస్తుంది. హైదరాబాద్ లో వెస్ట్, సౌత్ చూస్తే భూముల ధరలు బాగా పెరిగాయి. ధరలు అందుబాటులో లేవు. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం అభివృద్ధితో పాటు నిర్మాణ రంగ పాలసీల్లో కొన్ని మార్పులు చేస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సొంతింటి కల సాకారమవుతుందని చెప్పవచ్చును. రింగు రోడ్డు చుట్టూ గ్రిడ్ రోడ్లను నిర్మించి ప్రజా రవాణాను మెరుగుపరిస్తే సామాన్యుడికి సొంతిల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది.