11 May, 2026 | 1:39 AM

కబేలాకు అధికారుల అండ!?

11-05-2026 12:40 AM

పొంతన లేని సమాధానం చెబుతున్న దేవదాయశాఖ అధికారులు

ఆ ప్రైవేట్ వ్యాపారి వెనక ఇంకెవరైనా ఉన్నారా?

ఏడుపాయల్లో పలు విమర్శలకు తావిస్తున్న ప్రైవేటు వ్యక్తుల దోపిడీ

పాపన్నపేట,మే10: జనమేజయుడు సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ క్షేత్రం.. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆలయం.. జంట నగరవాసులు, పొరుగు రాష్ట్రాల వారిని సైతం ఆకర్షిస్తున్న ఆధ్యాత్మిక క్షేత్రం.. ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడే ప్రాంగణం.. ఏటా రూ. కోట్లలో సమకూరే ఆదాయం.. దేశంలోనే రెండోవ వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ప్రైవేట్ వ్యాపారులకు అధికారులు కొమ్ముకాస్తున్నారు.

ఎలాంటి టెండర్ లేకుండా కబేలాను ఓ ప్రైవేటు వ్యక్తి నిర్వహించడం పై పలు విమర్శలు రేకెత్తుతున్నాయి. అతనికి అధికారులు అండగా ఉండడంతోనే భక్తులను దోపిడీ చేస్తున్నాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయమై గత సోమవారం విజయక్రాంతి దినపత్రికలో శీర్షిక వెలువడగా.. తూతూ మంత్రంగా ఉన్నతాధికారులు విచారణ జరిపారు.

ఏడుపాయల్లో అలాంటిదేమీ లేదని ఆర్ జే సీ విజయక్రాంతి దినపత్రిక విలేఖరికి చెప్పడం కొసమెరుపు. అలాంటిదేమీ లేనప్పుడు ప్రైవేటు వ్యక్తికి ఎలాంటి టెండర్ లేకుండా కబేలా నిర్వహించే హక్కు ఇవ్వడం, మేక బరువుకు సంబంధం లేకుండా భక్తుల నుంచి నగదు దండుకోవడం శోచనీయం. ఇది ఇలా ఉండగా.. ఆదివారం సైతం హైదరాబాదుకు చెందిన ఓ భక్తుని వద్ద సుమారు 10-12 కిలోల మేకకు రూ.900 దండుకున్నారు.ఈ విషయమై ఈవో వీరేశంను వివరణ కోరగా.. పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. కబేలా నిర్వహణ వ్యక్తికి రాతపూర్వకంగా ఇచ్చిన ఏదైనా లేఖ చూపించమంటే అలాంటిది ఏం లేదని చెబుతున్నాడు.

2017లో పాలకమండలి సభ్యులు ఆలయ సమీపంలో కబేలా నిర్మించాలని నిర్ణయించారని, 2017 నవంబర్ 28న అప్పటి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై కబేలా నిర్మాణానికి భూమి పూజ చేశారని, మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కబేలా నిర్మాణం పనులు దక్కించుకొని పూర్తి చేశాడని, కబేలా నిర్మించేందుకు సంబంధిత శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకున్నా.. అప్పుడు ఉన్న ఆలయ ఈవో వెంకట కిషన్ రావు, పాలకమండలి కబేలా నిర్మాణం పూర్తి చేశాక అనుమతులు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో నిర్మాణాన్ని పూర్తి చేశాడని, నిర్మాణం పూర్తయ్యాక 4-5 సంవత్సరాలు వరకు దానిపై హక్కుదారుడిగా వ్యవహరించి ఆ తర్వాత దేవస్థానానికి అప్పగించేలా అనుమతులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

కబేలా నిర్మించి సుమారు 9 సంవత్సరాలు గడుస్తుంది. నిర్మించిన వ్యక్తి సుమారు ఆరు సంవత్సరాలుగా కబేలాలో దందా కొనసాగించాడు. 2023 నుంచి సుమారు రెండు సంవత్సరాల పాటు ఆలయం తరపున కబేలాను కొనసాగించగా.. మరల ఎలాంటి టెండర్ లేకుండా అదే వ్యక్తికి అప్పజెప్పడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు దీనిపై దృష్టి సారించి భక్తులు దోపిడీకి గురికాకుండా అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.