ఆదాయ మార్గాలు అన్వేషించండి
- కమర్షియల్ టాక్స్‌లో సర్కిల్ వారీగా సమీక్షలు జరపాలి
- ఇతర రాష్ట్రాల్లోని విధానాలపై అధ్యయనం తప్పనిసరి
- ఆదాయ వనరుల సమీక్షలో అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): కమర్షియల్ టాక్స్ శాఖలో ఆదాయం పెంచేందుకు సర్కిల్ వారీగా సమీక్షలు నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుదలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి 15రోజుల్లో నివేదిక తెప్పించాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును ఆదేశించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం రాష్ర్ట ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుదిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కమర్షియల్ టాక్స్ విభాగానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను తప్పనిసరిగా అధ్యయనం చేయాలని సూచించారు.
స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖతో ముడిపడి ఉన్న హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హౌసింగ్ బోర్డు వంటి ఇతర శాఖలను సమన్వయం చేసుకొని ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలను సమన్వయం చేసుకునే అంశాన్ని చీఫ్ సెక్రటరీ సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. రవాణా శాఖలో నిర్ద్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోకపోవడానికి కార ణాలు, వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.
అవసరమైతే ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని మంత్రులు తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్‌ఏ రిజ్వీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమో హన్, కమర్షియల్ టాక్స్ కమిషనర్ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






