రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇంట్లో పేలుడు
తప్పిన ప్రాణనష్టం
ధ్వంసమైన ఇల్లు, సామగ్రి
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ కృష్ణయ్య
సరూర్‌నగర్ డివిజన్ చౌడి సమీపంలో ఘటన
ఎల్బీనగర్, జూన్ 30 (విజయక్రాంతి): సరూర్‌నగర్ డివిజన్ ప్రజలు మంగళవారం ఓ ఇంటిలో జరిగి న పేలుడుకి ఉలిక్కి పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. చౌడి సమీపంలోని బాపునగర్ రోడ్డు నంబర్ 4లో ఉన్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవరశెట్టి దేవేందర్ ఇంటిలో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. దీంతో వంటగది పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో దేవేందర్ కుటుంబసభ్యులు అల్పాహారం చేసి హాల్‌లో కూర్చున్నారు. ఇంతలో హఠాత్తుగా పేలుడు జరగడంతో కుటుంబసభ్యులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సరూర్‌నగర్ పోలీ సులు క్లూస్ టీమ్‌ను పిలిపించి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్‌నగర్ సీఐ శ్రీశైలంతో పాటు హైడ్రా, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడు అనుమానస్పదంగా ఉండడంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.






