4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
స్వల్పంగా పెరిగిన ఎగుమతులు
న్యూఢిల్లీ, మే 15: భారత్ వాణిజ్యలోటు ఏప్రిల్ నెలలో 19.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది నాలుగు నెలల గరిష్ఠం. గత నెలలో ఎగుమతులు స్వల్పంగా 1 శాతం అధికమై 34.99 బిలియన్ డాలర్లకు చేరినట్టు కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన డేటాలో వెల్లడయ్యింది. ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, ఫార్మా ఎగుమతులు వృద్ధిచెందడంతో అంతర్జాతీయ అనిశ్చితి మధ్య ఎగుమతుల్లో పాజిటివ్ ట్రెండ్ సాధ్యపడింది. అయితే ఎగుమతులకంటే దిగుమతులు ఎక్కువగా 10.25 శాతం పెరిగి 54.09 బిలియన్ డాల ర్ల వద్ద నిలిచాయి. బంగారం దిగుమతులు గణనీయంగా పెరిగినందున మొత్తంగా దిగుమతులు అధికమయ్యాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్యలోటు 19.1 బిలియన్ డాలర్లకు ఎగిసింది. 2023 ఏప్రిల్‌లో ఇది 14.44 బిలియన్ డాలర్లు. 2023 డిసెంబర్‌లో నమోదైన 19.8 బిలియన్ డాలర్ల లోటు తర్వాత ఈ ఏప్రిల్‌లోనే గరిష్ఠస్థాయికి చేరింది.
బంగారం దిగుమతులు రెట్టింపు
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పుత్తడి దిగుమతులు నిరుడు ఇదేనెలతో పోలిస్తే రెట్టింపై 3.11 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ముడి చమురు దిగుమతులు సైతం 20.22 శాతం పెరిగి 16.5 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో సర్వీసుల ఎగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 25.78 బిలియన్ డాలర్ల నుంచి 29.57 బిలియన్ డాలర్లకు పెరిగాయి. సర్వీసుల దిగుమతులు 13.96 బిలియన్ డాలర్ల నుంచి 16.97 బిలియన్ డాలర్లకు చేరాయి.
కొత్త ఏడాది శుభారంభం
ఏప్రిల్ నెల గణాంకాలపై కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్తావాల్ మీడియాకు వివరిస్తూ కొత్త ఆర్థిక సంవత్సరం ఎగుమతులు వృద్ధిచెంది శుభారంభాన్ని ఇచ్చాయని, ఇదే ట్రెండ్ కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2023 పూర్తి ఆర్థిక సంవత్సరంలో మొత్తం వస్తూత్పత్తులు, సేవల ఎగుమతుల్ని 778.21 బిలియన్ డాలర్లకు సవరించామని, ఒక ఆర్థిక సంవ త్సరంలో ఇంతగా నమోదుకావడం రికార్డని వాణిజ్య కార్యదర్శి వివరించారు. గత ఏడాది 437.1 బిలియన్ల వస్తూత్పత్తులు, 341.1 బిలియన్ డాలర్ల సేవల ఎగుమతులు జరిగాయన్నారు. ఏప్రిల్ నెలలో ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 13 రంగాలు పాజిటివ్ వృద్ధిని కనపర్చాయని, ఇందులో కాఫీ, పొగా కు, మసాలా దినుసులు, ప్లాస్టిక్, హస్తకళా ఉత్పత్తులు ఉన్నాయని అన్నారు.






