‘మీ సేవ’కు మోక్షమెన్నడు..?
ఎనిమిదేళ్ల ఎదురుచూపులు..
అందని ద్రాక్షలా ప్రభుత్వ సేవలు!
మొయినాబాద్, మే 13 (విజయక్రాంతి): ఒకవైపు డిజిటల్ విప్లవం.. మరోవైపు గడపగడపకు పాలన అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, మొయినాబాద్ మండలంలోని క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేకుండా పోయింది. మండల ప్రజల కనీస అవసరమైన ’మీ సేవ’ కేంద్రాల ఏర్పాటుపై గత ఎనిమిదేళ్లుగా సాగుతున్న కాలయాపనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కటే కేంద్రం.. వేలమంది జనం..
మొయినాబాద్ మండలంలో ప్రస్తుతం 19 పంచాయతీలు, ఒక మున్సిపల్ ఉండగా... కేవలం రెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఒక్కటంటే ఒక్క మీ సేవ కేంద్రమే దిక్కయింది. మండల కేంద్రానికి ఈ కేంద్రం దూరంగా ఉండటంతో సుదూర గ్రామాల్లోని వృద్ధులు, మహిళలు, విద్యార్థులు రవాణా సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు.చిన్న సర్టిఫికేట్ కోసం కూడా ఒక రోజంతా వెచ్చించాల్సి రావడం, ఆటో చార్జీల రూపంలో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.
ఏకఛత్రాధిపత్యం.. ఆపై అడ్డగోలు వసూళ్లు!
పోటీ లేకపోవడం, ఒకే కేంద్రం ఉండటంతో సదరు నిర్వహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిర్ణయించిన ఫీజు కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే పని చేయమని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. అడిగే నాథుడే లేడు‘ అని స్థానిక బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన ఆరోపణలు ఇవే..
ప్రభుత్వ ధరల కంటే అధికంగా ఫీజులు వసూలు చేయడం. సమయపాలన పాటించకపోవడం, గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం.ప్రజల పట్ల దురుసు ప్రవర్తన, నిర్లక్ష్య ధోరణి తో ప్రజలు ప్రతినిత్యం అవస్థలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అంకెల గారడీ చేసే ప్రజాప్రతినిధులు, గెలిచిన తర్వాత కనీస సౌకర్యాల కల్పనను విస్మరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెండాలు మోయడానికి, స్వాగత సభలకు ఇచ్చే ప్రాధాన్యతలో కనీసం పది శాతం ప్రజల సమస్యలపై చూపిస్తే, మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కొత్త కేంద్రాలు వచ్చేవి కదా అని ప్రజలు నిలదీస్తున్నారు.
డిజిటల్ ఇండియా అంటే ఇదేనా..?
పేపర్లెస్ గవర్నెన్స్ అంటూ ఊదరగొడుతున్న పాలకులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కేంద్రాలను ఎందుకు పెంచడం లేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఆధార్ అప్డేట్లు, రైతు బంధు పత్రాలు, స్కాలర్షిప్పుల కోసం విద్యార్థులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం.
మొయినాబాద్ వాసుల డిమాండ్..
మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో తక్షణమే రెండు కంటే ఎక్కువ కొత్త మీ సేవ కేంద్రాలను మంజూరు చేయాలి. పెద్ద గ్రామ పంచాయతీల్లో డిజిటల్ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్న కేంద్రంపై రెవెన్యూ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అధిక వసూళ్లకు పాల్పడే వారి లైసెన్సులు రద్దు చేయాలి. వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి.
అధికారులు స్పందించాలి..
జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మరియు స్థానిక అధికారులు తక్షణమే చొరవ తీసుకుని ఈ ఏనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించాలని, మొయినాబాద్ ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయాలని కోరుతున్నారు. ఆ దిశగా ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుంటారని స్థానిక ప్రజలు విన్నవిస్తున్నారు.






