29-07-2025 11:54:30 AM
వాజేడు,(విజయక్రాంతి): వాజేడు మండల(Vajedu mandal) పరిధిలో స్థానిక ఎస్సై జక్కుల సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం విస్తృతంగా వాహన తనిఖీ చేపట్టారు. జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండటం కొరకు పోలీసులు గ్రామ గ్రామాన డేగ కన్నుతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాజేడు మండలం పూర్తిగా ఏజెన్సీ ఆదివాసి ప్రాంతం కావడం, గ్రామాల్లో అపరిచితులు సంచరించే అవకాశం ఉన్నందున భద్రత నేపథ్యంలో వాహన తనిఖీలు, కార్డెన్ చర్చ్ లు నిర్వహిస్తూ మావోయిస్టు కదలికలపై నిఘా పెంచారు. ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ నిర్వహించిన కర్రెగుట్టలకు సమీపంలో ఉన్న వాజేడు మండలంలో మావోయిస్టులు వారోత్సవాలను పురస్కరించుకొని రివేంజ్ తీర్చుకునే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మండలంలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కాగా సోమవారం మండల పరిధిలో గల ప్రగల్లపల్లి శివారులో వాహన తనిఖీ నిర్వహించి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించి వదిలేశారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.