భారత్‌కు లూథ్రా సోదరుల అప్పగింత
- గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో పలు అభియోగాలు
ప్రమాదం తర్వాత థాయ్‌లాండ్‌కు పరారైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా
ఇంటర్ పోల్ బ్లూ నోటీసు మేరకు భారత్‌కు అప్పగించిన థాయ్‌లాండ్
ఢిల్లీలో అరెస్ట్.. పాటియాలా కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
ఢిల్లీ, డిసెంబర్ 16 : గోవా నైట్‌క్లబ్ బిర్క్ బై రోమియో లేన్ అగ్నిప్రమాదం కేసులో పలు అభియోగాలు ఎదుర్కొంటున్న క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా ఎట్టకేలకు భారత్‌కు వచ్చారు. నైట్‌క్లబ్ ప్రమాదం తర్వాత లూథ్రా సొదరులు థాయ్‌లాండ్ పారిపోయారు. భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ బ్లూ నోటీసు జారీ చేసింది.
పది రోజుల తర్వాత థాయ్‌లాండ్ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం వారిని భారత్‌కు అప్పగించడంతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25మంది మరణించిన కేసులో క్లబ్ యజమానులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలపై పోలీసులు హత్యకు దారితీసే గాయాలు, నరహత్య, హత్య వంటి తీవ్రమైన అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.
అగ్ని ప్రమాదం జరిగిన ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో ఎటువంటి అత్యవసర నిష్క్రమణ ద్వారం లేదు. క్లబ్ యజమానులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, భద్రతా పరికరాలు లేకుండా ‘ఫైర్ షో‘ నిర్వహించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని బ్లూ కార్నర్ నోటీసులో పేర్కొన్నారు. అగ్నిమాపక యంత్రాలకు కూడా దారి లేని ఈ క్లబ్, సరైన అనుమతులు, లైసెన్సులు లేకుండానే నడుస్తోందని దర్యాప్తులో తేలింది. ఢిల్లీకి చేరుకున్న లూథ్రా సోదరులను పోలీసులు పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత, గోవా పోలీసులు వారి కస్టడీని తీసుకుని విచారణ కొనసాగించనున్నారు.




