23 March, 2026 | 9:19 AM

‘వీబీ రాం జీ’ బిల్లుపై రగడ

17-12-2025 01:13 AM
  1. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
  2. బిల్లుపై విపక్షాల అభ్యంతరాలు
  3. నిధుల వాటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 60:40 నిష్పత్తిపై నిరసన
  4. రాష్ట్రప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఏ) చట్టాన్ని రద్దు చేస్తూ, దాని స్థానంలో ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (వీబీ -జీ రామ్ జీ) చట్టం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగానే కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మంగళవారం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు.

ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్‌ఆర్‌ఈజీఏ చట్టాన్ని రద్దు చేయడం, గాంధీ పేరును సైతం మార్చడంపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. నిధుల కేటాయింపులో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వాటా 60:40 నిష్పత్తి నిర్ణయంపై నిప్పులు చెరిగాయి. ఆ నిష్పత్తిపై హిమాలయన్, ఈశాన్య రాష్ట్రాలకు మినహాయింపులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ..

మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటని నిలదీశాయి. ఆయా రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ వివాదాస్పద బిల్లుపై మరింత చర్చ జరగాలని పట్టుబట్టాయి. బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపించాలని వారు డిమాండ్ చేశాయి. ఒకదశలో అధికార, ప్రతిపక్షాల వాగ్వాదాలు  తారస్థాయికి చేరుకున్నాయి. విపక్షాలు వెల్ వద్దకు దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి. ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లుకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి.   

మరో రెండు బిల్లులు

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ మరో రెండు బిల్లులనూ ప్రవేశపెట్టింది. వాటిలో ‘ఆటమిక్ ఎనర్జీ బిల్లు’, ‘హయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు’ ఉన్నాయి. అణుశక్తి బిల్లు ద్వారా ఆ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అలాగే విద్య, పరిశోధన రంగాల బలోపేతం కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ బిల్లు. రెండు బిల్లులపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ప్రజాభిపాయ సేకరణ, చర్చ లేకుండానే బిల్లులు ప్రవేశ పెట్టడాన్ని తప్పుబట్టాయి. అలాగే ‘సబ్‌కా బీమా సబ్‌కీ రక్షా సవరణ బిల్లు సభలో ఆమోదం పొందింది. 2047 నాటికి దేశ పౌరులందరికీ బీమా కల్పించడమే ధ్యేయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎక్కువ ఎఫ్‌డీఐల ద్వారా మరిన్ని బీమా కంపెనీలు దేశంలోకి వస్తాయన్నారు.

నిరుపేదల హక్కులపై ఇది ప్రత్యక్ష దాడి

కొత్త చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మూల సూత్రాలను పక్కనపెట్టింది. ఇది నిరుపేదల హక్కులపై ప్రత్యక్ష దాడి.కోట్లాది గ్రామీణ కుటుంబాలకు అన్నం పెట్టే పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నింది.

కొవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ ఉపాధి పథకం పేదలను ఆదుకుందని ప్రధాని గుర్తుంచుకోవాలి. గాంధీ ఆదర్శాల కూడా కొత్తచట్టం అవమానకరం. మోదీకి ప్రధానంగా రెండు విషయాలపై తీవ్రమైన ద్వేషం ఉంది. ఒకటి గాంధీ ఆదర్శాలు. రెండోది నిరుపేదల హక్కులు.

 రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

రాముడి పేరును బద్నాం చేయొద్దు !

ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనైతికం. ఇది తిరోగమన చర్య. పథకం పేరు మార్చడమంటే గాంధీ ఆదర్శాలను నేరుగా అవమానించినట్లే. గాంధీ స్ఫూర్తి, ఆయన తాత్విక పునాదులు దెబ్బతీయడమే. గాంధీ గ్రామాల్లో రామరాజ్యాన్ని కోరుకున్నారే గానీ, రాజకీయ రాజ్యం కాదు.  1971 నాటి ‘హరే రామ హరే కృష్ణ’ చిత్రంలో ఒక పాట ఉంది.

ఆ పాట ‘దేఖో ఓ దీవానో ! యే కామ్ నా కరో.. రామ్ కా నామ్ బద్నామ్ నా కరో’ (ఓరి పిచ్చివాళ్లారా రాముడి పేరును అపఖ్యాతి పాలు చేయకండి) అని సాగుతుంది. బీజేపీ పెద్దలూ.. ఒక్కసారి ఆ పాటను ఆలకించండి. 

 శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ

గాంధీ అంటే మాకెంతో గౌరవం

మహాత్మాగాంధీ అంటే మాకెంతో గౌరవం. మా పార్టీ గాంధీ సిద్ధాంతాలను అవలంబిస్తోంది. ఆయన స్ఫూర్తితోనే మేం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ప్రధాని మోదీ అహర్నిశలు పల్లెల బాగు కోసం పనిచేస్తున్నారు.

కొత్త చట్టం తీసుకురావడంలో మాకెలాంటి దురుద్దేశం లేదు. గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుపేదలకు మెరుగైన ఉపాధి కల్పించి, జీవన ప్రమాణాలు పెంచడమే మా లక్ష్యం. మేం పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచాం. కొత్త చట్టం తీసుకువస్తే పాత చట్టాన్ని రద్దు చేసినట్లు కాదు. మరింతో బలోపేతం చేసినట్టు. 

 శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి

పేర్లు మార్చడమంటే మోదీకి ఎంతో ఇష్టం

పథకాల పేర్లు మార్చడమంటే ప్రధాని మోదీకి ఎంతోఇష్టం. పేర్ల మార్పుపై బీజేపీ నేతలకు ఎనలేని ఆసక్తి ఎందుకో అర్థం కావడం లేదు. పేరు మారిస్తే వందల కోట్ల ప్రజాధనం వృథా అవుతుంది. 2005 నుంచి అమలులో ఉన్న ఎన్‌ఆర్‌ఈజీఏ చట్టం పేద ప్రజలకు అండగా నిలిచింది. జాబు కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ ఏడాదిలో 100 రోజుల పాటు ఉపాధి కల్పించింది.

అంతా సజావుగానే ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ చట్టాన్ని రద్దు చేస్తోంది? కేవలం ఒకటో, రెండో సంస్కరణలు చేసి కొత్త చట్టం తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమేంటి? కేవలం పని దినాలు పెంచడమే సంస్కరణ? అదే.. కేంద్రం నమ్మితే పనిదినాలు పెంచితే సరిపోయేది కదా.

పనిదినాలు పెంచారు సరే.. పనికి తగిన వేతనం ఎవరు ఇవ్వాలి. కేంద్రం ఎందుకు వేతనం పెంచడం లేదు. గాంధీ మా కుటుంబానికి చెందిన వ్యక్తి అని బీజేపీ నేతలు అంటారు. ఆయన మా కుటుంబ సభ్యుడితో సమానం. యావత్ దేశ ప్రజలూ ఆయన్ను కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు. మా కుటుంబం కూడా అలాగే భావిస్తున్నది.

 ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీ