నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలో నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో రూ.16.25 లక్షల విలువైన సుమారు 6.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న మధ్యాహ్నం ఆసిఫాబాద్ మండలంలో నకిలీ పత్తి విత్తనాల రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్.ఐ బొజ్జిరావు ఆధ్వర్యం లో గుండి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఏపీ 01ఎన్ 1500 నంబర్ గల కారును ఆపి తనిఖీ చేయగా, రెండు హెచ్డీపీఈ సంచుల్లో 80 కిలోల Glycel BT నకిలీ పత్తి విత్తనాలు గుర్తించారు. విచారణలో నిందితుడు రాచర్ల మహేష్ విత్తనాలను గుజరాత్కు చెందిన అంకిత్ నుండి కొనుగోలు చేసి రైతులకు విక్రయించేందు కు తరలిస్తున్నట్లు తెలిపారు. విచారణలో రాచర్ల మహేష్ ఇచ్చిన సమాచారం మేరకు తాండూరలోని అతని గోదాములో పోలీసులు సోదాలు నిర్వహించగా, 14 హెచ్డీపీఈ సంచులు, 3 గన్నీ సంచుల్లో సుమారు 5.7 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం స్వాధీనం చేసిన విత్తనాల విలువ సుమారు రూ.16.25 లక్షలు గా అంచనా వేస్తున్నారు.మండల వ్యవసాయ అధికారి మిళింద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రాచర్ల మహేష్, సాయి కిరణ్లను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు ఎస్హెచ్‌ఓ పి. బాలాజీ వర ప్రసాద్ తెలిపారు.






