మేడ్చల్ జిల్లాలో నకిలీ వైద్యుల గుట్టురట్టు
పోలీసుల అదుపులో ఐదుగురు
మేడ్చల్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో నకిలీ డాక్టర్ల గుట్టు రట్టయింది. ’విజయక్రాంతి’ దినపత్రికలో శనివారం ’గల్లీకో శంకర్ దాదా ఎంబీబీఎస్’శీర్షికన వచ్చిన కథనం నేపథ్యంలో ఎస్ ఓ టి పోలీసులు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆసుపత్రులలో సోదాలు నిర్వహించారు. అర్హత లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు, అందులోనే మందులు విక్రయిస్తున్నట్లు, బెడ్లు వేసి ఇన్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడైంది.
మేడ్చల్, ఎల్లంపేట, జగద్గిరిగుట్ట, పేట్ బషీరాబాద్, సూరారం ప్రాంతాలలో సోదాలు చేసి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఎల్లంపేటకు చెందిన రామగోని పంజా గౌడ్, మేడ్చల్ లోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఎం సుధాకర్ చారి తదితరులున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






